Sun. Sep 15th, 2019

Sambashana

Online News Portal

జర్నలిస్టులకి అంకితం…

1 min read

సమిధలం ….

మేం చీకట్లను దిగమింగి అక్షరాలను వెలిగిస్తాం
నిశీధివేళ నిలువెత్తు చైతన్యంతో కాంతి దారులు నిర్మిస్తాం
లోకం లోలకమై నిద్రలో తూగుతుంటే
రెప్పవాల్చని మహా యజ్ఞం చేస్తూ
రేపటి రోజుకు దిశానిర్దేశం చేస్తాం
అర్థరాత్రి వేళ కాలం గిరి గీసే పరిమితులను
కొనగోటితో విసిరి అవతల పారేస్తాం

మేం సైనికులం.. క్రాంతదర్శులం
సంచలనాల సృష్టి కర్తలం
కన్నీళ్లను తుడిచే మానవతా వాదులం
జన తంత్రుల్ని భగ భగ మండించే సాహస జ్వాలలం
సమాజ ధర్మాగ్రహానికి నీరాజనాలు పలికే బానిసలం
అవినీతి, అక్రమార్కుల భరతం పట్టే యమదూతలం

పాలకవర్గాలకు అసలుసిసలు ప్రతిపక్షాలం
పీడిత జనసామాన్యానికి గొంతుకలం
అంతర్,బహిర్ యుద్ధాలతో సాగే అభిమన్యులం
అక్షరాలకు ప్రాణం పోసి రామబాణంలా సంధించే యోధులం
కాలగతిని మనోనేత్రంతో వీక్షించే మహా బల సంపన్నులం

అంతిమంగా నేటికీ, రేపటికీ మధ్య వారధులం
లిఖిత చరిత్రకు పేటెంట్ లేని వారసులం
లోకం జేజేల నిషాకు సదా వ్యసనపరులం
ఉదయాస్తమయాలు ఎరుగని కార్మికులం
అక్షరలక్షల్నే అస్తులుగా భ్రమ పడే అమాయకులం

మేం పాత్రికేయులం
అక్షరాలను శ్వాసిస్తూ… శాసిస్తూ…
నిరంతరం జ్వలించే సమిధలం

Article By: Saradhi, Senior Journalist

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.