Tue. Aug 4th, 2020

Sambashana

Telugu News Portal

రివ్యూ రైటర్స్ మూర్ఖులా? ఎంత మాట అన్నావ్ ఆలీ

1 min read
ali on critics

ఓంకార్ తెరకెక్కిన లేటెస్ట్ సినిమా రాజు గారి గది3. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమాకి నెగటివ్ రివ్యూస్ వచ్చాయి, సినిమా చూసిన కామన్ ఆడియన్స్ అభిప్రాయం కాసేపు పక్కన పెడితే నిన్న రాజు గారి గది 3 సక్సస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా కమెడియన్ ఆలీ రివ్యూ రైటర్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. తాను థియేటర్ లో ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూశానని, సినిమ చూస్తున్నంత సేపు వాళ్ళు హాయిగా నవ్వుకున్నారని, తమ టీం ని అభినందించారని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ ప్రివ్యూ థియేటర్లో సినిమా చూడడమే వేస్ట్ అని అన్నాడు.

ali on critics

ప్రివ్యూ థియేటర్లో సినిమా చూస్తూ నవ్వితే తమ సొమ్మేదో పోయినట్టుగా ఎవరూ నవ్వరని..ఇకనుండి ప్రివ్యూ థియేటర్ లో సినిమాలు చూడనని తెగేసి చెప్పిన అలీ, ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూల రాసిన వారంతా మూర్ఖులు… మేం సినిమా తీసేది ప్రేక్షకుల కోసమేనని, ఎవరో కోన్ కిస్కా గొట్టం గాళ్ళ కోసం సినిమా తీయమని కాస్త గట్టిగానే మాట్లాడాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే అలీ సడన్ గా ఇలా ఎందుకు రియాక్ట్ అయ్యాడు అనే విషయం ఎవరికీ అర్ధం కాలేదు.

అయితే అలీ నెగటివ్ రివ్యూస్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు క్రిటిక్స్ సినిమాని చంపేస్తున్నారు అన్న రేంజులో కామెంట్స్ చేస్తున్నాడు. అదే పాజిటివ్ రివ్యూస్ వచ్చి ఉంటే ఇలా మాట్లాడే వాడా? క్రిటిక్స్ వల్ల సినిమా చచ్చిపోతుంది అనే మాట అలీ నోటి వెంట వచ్చేదా అంటే తప్పకుండా రాదు. ఎందుకంటే ఆ పాజిటివ్ రివ్యూ అలికి నచ్చుతుంది కాబట్టి, నిజంగానే సినిమాని క్రిటిక్స్ చంపేస్తున్నా కూడా తన సినిమాకి, తాను నటించిన సినిమాకి పాజిటివ్ రివ్యూస్ రావడం అనేది అలికి నచ్చుతుంది.

ఆలీకే కాదు ఎవరి సినిమాకైనా పాజిటివ్ రివ్యూస్ వస్తే నచ్చుతుంది. నిజానికి సినిమాని చంపేస్తుంది క్రిటిక్స్ కాదు ఇండస్ట్రీ వాళ్లే. రివ్యూ సినిమాని చంపేస్తుంది అనేది వాళ్లే, ఫస్ట్ డే మంచి రివ్యూ రాగానే షేర్ చేస్తుంది వాళ్లే. అసలు రివ్యూ ఉండాలా వద్దా అనే క్లారిటీ ఇండస్ట్రీ వాళ్లకే లేక సినిమా చచ్చిపోతుంది.

అసలు సమస్యల్లా ఈ నెగటివ్ రివ్యూస్ వచ్చినప్పుడే. పాజిటివ్ రివ్యూ వస్తే హ్యాపీగా ఉండే మీరు, నెగటివ్ రివ్యూ వచ్చినప్పుడు కూడా రిసీవ్ చేసుకోండి. సినిమాలో ఎక్కడ తప్పు జరిగిందో అలోచించి ఈసారి జాగ్రత్త పడండి. అంతే కానీ మంచిగా రాస్తేనేమో అదో అద్భుతంలా, కాస్త నెగటివ్ రాస్తేనేమో అదేదో భయంకరమైన తప్పులా మాట్లాడడం బాగోలేదు. ఓరి దేవుడో ఈ పాజిటివ్, నెగటివ్ గోల అంతా ఎందుకు అంటారా… సినిమా రివ్యూ అనేదే వద్దు అని చెప్పండి, సినిమాలకి రివ్యూలు రాయకండి అని డిమాండ్ చేయండి…

ఈ విషయంపై ఇండస్ట్రీ మొత్తాని ఒకతాటిపై తీసుకురండి. రివ్యూస్ రాసే వెబ్ సైట్స్ కి, యూట్యూబ్ ఛానల్స్ కి యాడ్స్ ఇవ్వకండి, ఇంటర్వూస్ ఇవ్వకండి. అన్నింటికీ మించి బాగోలేని సినిమాకి కూడా పాజిటివ్ రివ్యూలు రాయమని డబ్బులు ఇవ్వకండి. అప్పుడు నిజంగా సినిమా బ్రతుకుతుంది. మీరు అంత నిజాయతీగా నిక్కచ్చిగా ఉన్న రోజు నిజంగానే సినిమా బ్రతుకుతుంది.

సరే పోనీ రివ్యూ అనేది తప్పకుండా ఉండాలి అంటారా? సరే అలాగే కానివ్వండి, ప్రతి సినిమాకి రివ్యూ రాయమని చెప్పండి, అయితే అది సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల తర్వాతే జరగాలి. అంటే శుక్రవారం సినిమా రిలీజ్ అయితే ఆదివారం లేదా సోమవారం రివ్యూలు రాసేలా చర్యలు తీసుకోవాలి. అది చేయగలిగితే, రెండు రోజుల టైం దొరుకుతుంది కాబట్టి రిలీజ్ అయిన ప్రతి సినిమాకి ఫస్ట్ 2 డేస్ డబ్బులు వస్తాయి.

సినిమాలో విషయం కూడా ఉంటే సోమవారం థియేటర్స్ లో కూడా ఉంటుంది. అలా శుక్రవారం రిలీజ్ అయిన సినిమా సోమవారం టెస్ట్ ని, అదే ట్రేడ్ వర్గాల భాషలో చెప్పాలంటే మండే టెస్ట్ ని పాస్ అయ్యింది అంటే దాదాపు ఆ సినిమా హిట్ బొమ్మ కింద లెక్కే. పైవేమి చేయలేని నాడు, బుక్ మై షోలో రేటింగ్ లు, ఐమాక్స్ లో ఇంటర్వెల్ సేల్స్, సోషల్ మీడియాలో క్రిటిక్ పెట్టే ఆర్టికల్స్… మన సినిమా భవిశ్యత్తుని నిర్ణయిస్తునే ఉంటాయి.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.