Tue. Aug 4th, 2020

Sambashana

Telugu News Portal

పాఠాలు చెప్పే పంతులు అనుకున్నారు… పోయించాడు

1 min read
surya sen

భారతదేశ స్వాతంత్ర పోరాట చరిత్రలో చిట్టగాంగ్ ఆర్మోరి రైడ్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ దాడిని చేసింది ఒక టీచర్ అంటే నమ్మగలరా? అవును కేవలం నలుగురు పెద్దవాళ్ళు, నలభై మంది విద్యార్థులని వెనకేసుకొని ఒక్కడు చేసిన పోరాటం చెరిత్రకెక్కింది. సౌమ్యంగా ఉండే టీచర్, అంత పెద్ద తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటి? అసలు అతను ఎవరు? మన వీరుల జాబితాలో అతని పేరు ఉందా లేదా ఒకసారి చూద్దాం.

అది జనవరి 11 1934 చిట్టగాంగ్ సెంట్రల్ జైలు… తెల్లవారితే ఉరి తీయాల్సిన వ్యక్తిని బ్రిటిష్ అధికారులు దారుణంగా హింసిస్తున్నారు. ఉదయం చనిపోయే వ్యక్తిని జైలు అధికారులు అంతగా హింసించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత పెద్ద తప్పు అతను ఏం చేశాడు. ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే… బ్రిటిష్ అధికారులు పట్టుకోని హింసిస్తున్న అతని పేరు సూర్య సేన్, మాస్టర్ దా సూర్య సేన్. నపోరా ప్రాంతంలో 18 అక్టోబర్ 1893లో శశికళ రామ్నిరాజన్ దంపతులకి పుట్టిన బిడ్డ సూర్య సేన్. తండ్రి టీచర్ కావడంతో సూర్య సేన్ కూడా బాగా చదువుకున్నాడు. చిన్న వయసులోనే స్కూల్ పుస్తకాలతో పాటు చరిత్ర పుస్తకాలు తిరగేయడం మొదలుపెట్టాడు. తిరుగుబాటు చేయాలి అనుకున్నాడు కానీ వయసు సహకరించలేదు. దీంతో చదువు పైనే ద్రుష్టి పెట్టాడు, ఎంత చదువు… కుటుంబం అనే ఆలోచనలో ఉన్నా అక్కడ వినిపిస్తున్న స్వాతంత్ర పోరాటాలు సూర్య సేన్ లోని దేశభక్తుడిని నిద్రలేపుతూనే ఉన్నాయి. వాటి ప్రభావంతోనే బెహ్రాంపూర్ లో డిగ్రీ చదువుకునే టైంలోనే సూర్య సేన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరాడు.

డిగ్రీ పూర్తి అయ్యే సమయానికి సూర్య సేన్ రాజకీయాల్లో రాటు దేలాడు. సందర్భం వచ్చిన ప్రతిసారి దేశం తరుపున తన గొంతు వినిపిస్తూనే ఉన్నాడు. బీఏ అయిపొయింది, యూనివర్సిటీ చదువు కోసం సూర్య సేన్ కలకత్తా వెళ్లాడు. పుట్టిన గడ్డకి, చదివిన నెలకి దూరంగా వెళ్లిన సూర్య సేన్ సరిగ్గా రెండేళ్ల తర్వాత తిరిగి చిట్టగాంగ్ లో అడుగుపెట్టాడు. ఆ అడుగే ఒక పెను పోరాటానికి పునాది అవుతుందని ఎవరూ ఊహించలేదు. కాలం మారింది, సూర్య సేన్ రాటు దేలాడు, అతనిలో ఇప్పుడు టీచర్ లేడు నాయకుడు ఉన్నాడు. దేశం కోసం పోరాటం నడిపించాలనే సంకల్పంతో ఉన్న నాయకుడు మాత్రమే ఉన్నాడు.

కలకత్తా నుంచి తిరిగొచ్చిన సూర్య సేన్, 1918లో అనుశిలన్ సమితిలో చేరాడు, అదే సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. 1919 జరిగిన జలియన్ వాలా బాగ్ ఘటన సూర్యలో దేశం గురించి పోరాటం చేయాలనే కసిని మరింత పెంచింది. దేశం కోసం తిరుగుబాటు చేస్తూనే నేషనల్ స్కూల్ లో లెక్కల టీచర్ గా చేరిన సూర్య సేన్ ని, ప్రజలు… విద్యార్థులు “మాస్టర్ దా” అని పిలవడం మొదలుపెట్టారు. ఇక్కడి నుంచి సూర్య సేన్… మాస్టర్ దా సూర్య సేన్ గా మారాడు. తన వృత్తి, మాటల నైపుణ్యాన్ని సూర్య సేన్ పిల్లల్లో చైతన్యం తీసుకురావడానికి… పోరాట కాంక్ష రగిలించడానికి వాడాడు. పాఠాలు చెప్పాల్సిన లెక్కల మాస్టర్, పిల్లలకి పోరాటాన్ని నూరిపోశాడు. దేశం కోసం ప్రాణం వదలడం తప్పు కాదు, అది మన బాధ్యత అనే స్ఫూర్తి రగిలించడంలో సఫలం అయ్యాడు.

ఆ తర్వాత 12 ఏళ్ల పాటు పాఠాలు చెప్తూనే పోరాటాలు చేసిన సూర్య సేన్, 1930లో చిట్టగాంగ్ ఆర్మోరి రైడ్ కి ప్రణాళిక రచించాడు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ దాడిని చేసింది కేవలం 65మంది అంటే నమ్మగలరా? ఒక్కడి నాయకత్వంలో నడిచిన 65 మంది కలిసి ఎప్పటికీ గుర్తుండి పోయే పోరాటం చేశారు. చిట్టగాంగ్ లోని రెండు ఆయుధ కర్మాగారాన్ని కొల్లగొట్టి, బ్రిటిష్ సైన్యాన్ని గట్టి దెబ్బ తీయాలని ప్రణాళికి రచించాడు. అందుకు తన దెగ్గర ఉన్న 65 మందిని టీమ్స్ గా విడదీసి, ఒక్కో టీంకి ఒక్కో పని అప్పగించాడు. మిగిలిన బ్రిటిష్ ఆక్రమిత ఇండియా నుంచి చిట్టగాంగ్ ని వేరు చేసి దానికి విముక్తి ప్రకటించాలనేది సూర్య సేన్ సంకల్పం. ఈ సంకల్పాన్ని నిజం చేయడానికి, అనంత్ సింగ్, గణేష్ గోష్, లోకనాథ్ బాల్, ప్రీతిలత, కల్పనలు అండగా నిలిచారు.

చిట్టగాంగ్ కి స్వాతంత్య్రాన్ని ప్రకటించడానికి పోరాటం మొదలుపెట్టిన సూర్య సేన్ అండ్ గ్యాంగ్… 18 ట్రూప్స్ గా విడిపోయి ముందుగా చిట్టగాంగ్ ని ప్రపంచం నుంచి వేరు చేస్తూ నెట్వర్క్ ని కట్ చేశారు.. టెలీఫోన్స్, రైల్ వే లైన్స్, రోడ్స్ ఇలా అన్ని రవాణా దారులని, కమ్యూనికేషన్ వ్యవస్థని దెబ్బ తీశారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తినడంతో చిట్టగాంగ్ లో ఏం జరుగుతుంది అనే విషయం ప్రపంచానికి తెలియకుండా పోయింది. ఇన్ఫర్మేషన్ పాసింగ్ ఆగిపోవడంతో సూర్య సేన్ అండ్ టీం ఆయుధకర్మగాలపై దాడి చేశారు. చాలా పకడ్బందీగా జరిగిన ఈ దాడిలో గన్నులు, మందు గుండు సామాగ్రిని కొల్లగొట్టారు. ఆశించినంత అమోనియా దొరకలేదు కానీ అనుకున్న ప్రణాలకని అమలు చేయడంలో అందరూ సక్సస్ అయ్యారు. కానీ అన్నీ అనుకున్నట్లు కావు కదా, అంతా అనుకున్నట్లే జరుగుతుంది అనుకుంటున్న టైములో బ్రిటిష్ పోలీసుల దాడి జరిగింది. ఊహించని ఈ పరిణామం కాల్పులు జరగడానికి కారణం అయ్యింది. చిమ్మచీకట్లో తుపాకుల మోతతో దద్దరిల్లింది. పాలీసులకి, తిరుగుబాటు దారులకి మధ్య జరుగుతున్న తుపాకుల మోతలో చనిపోయిన 12 మంది పోరాట యోధుల కేకలు వినిపించకుండా పోయాయి కానీ 80 మంది పోలీసులని చంపామనే గర్వంతో వారు మరణించి ఉంటారు. ఎదురు నిలిచిన ప్రతి పోలీసుని అడ్డుకోని, ఆయుధ కర్మాగారాన్ని కొల్లగొట్టమనే విజయ స్ఫూర్తితో సూర్య సేన్ మూడు రంగుల జండాని ఎగరేశాడు. 1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ అంతకన్నా 17 ఏళ్ల ముందే 1930 ఏప్రిల్ 18న చిట్టగాంగ్ ని స్వాతంత్రం వచ్చింది. కమ్ముకున్న కారు చీకట్లని చీల్చుకుంటూ మన త్రివర్ణ పథకం రెపరెపలాడింది. ఆ క్షణంలో సూర్యతో పాటు ఉన్న 65 మంది దేశానికే స్వాతంత్రం తెచ్చినంత గర్వంగా ఫీల్ అయి ఉంటారు. ఆ ప్రాంతంలో అర్ధరాత్రి ఎగిరిన మన జండా, తెల్లవారు జాము వరకూ ఎగురుతూనే ఉంది. ఇది మన దేశ స్వాతంత్ర పోరాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికించబడింది.

ఈ పోరాటం దేశం కోసం బ్రతకాలి అనుకునే ప్రతి ఒక్కడిలో స్వాతంత్ర కాంక్ష రగిలించింది. సూర్య సేన్ స్పూర్తితో ఎందరో తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. చిట్టగాంగ్ దాడి తర్వాత చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయిన సూర్య సేన్ అండ్ టీం, సమయం దొరికినప్పుడల్లా బ్రిటిష్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు. ఇలా మూడేళ్ల పాటు అజ్ఞాతంలో గడిపిన సూర్య సేన్, తన అనుచరుడు నేత్ర సేన్ ఇంట్లో తలదాచుకున్నాడు. అండర్ గ్రౌండ్ లో ఉన్న ఈ టైములో సూర్య సేన్… రైతుగా, సాధువుగా, ఒక ముసల్మాన్ గా మారుతూ జీవనం సాగించాడు. అయితే శత్రువులు ఎప్పుడూ పక్కనే ఉంటారు అన్నట్లు, సూర్య సేన్ తనని పట్టించే వాడి ఇంట్లోనే తాను ఉన్నాను అనే విషయం గుర్తించలేకపోయాడు. సూర్య సేన్ పై ప్రకటించిన 10000 కోసం ఆశపడి నేత్ర సేన్, పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సూర్య సేన్ ఉన్న ఇంటిని పోలీసులు చుట్టూముట్టారు, వాళ్ల నుంచి తప్పించుకోవడానికి సూర్య కాల్పులు జరిపాడు. అంతమంది ముందు ఒక్కడు చేసిన పోరాటం నిలవలేకపోయింది, పోరాటం కన్నా మదిలో నమ్మిన వాడు చేసిన మోసమే మదిలో మదిలో మెదులుతున్నట్లు ఉంది. తిరుగుబాటు జండా ఎగరేసిన వీరుడి గున్ను నుంచి బుల్లెట్ రావడం ఆగిపోయింది, పోలీసులు సూర్య సేన్ ని పట్టుకున్నారు. మూడేళ్ల అజ్ఞాతవాస పోరాటానికి తెరదించుతూ 16 ఏప్రిల్ 1933న పోలీసులు సూర్య సేన్ ని పట్టుకున్నారు. ఆరు నెలల పాటు సూర్య సేన్ ని హింసించిన తర్వాత 12 జనవరి 1934 తెల్లవారు జామున 6 గంటలకి ఉరి తీశారు. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో మన వీరుడు అస్థమించాడు. రెపరెపలాడుతున్న జండాని చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ గర్వంగా కనుమూశాడు.

సూర్య సేన్ తో పాటు చిట్టగాంగ్ ఆర్మోరి రైడ్ లో పాల్గొన్న తారకేశ్వర్ దస్తీదార్ ని కూడా అదే రోజు, అదే సమయానికి ఉరితీశారు. ఈ ఆర్మోరి రైడ్ లో పాల్గొన్న వారు ఒక్కరక్కరు ఒక్కోలా మరణించారు, వీరిలో బినోద్ బీహారీ చౌదరి అనే వ్యక్తి మాత్రం 103 ఏళ్ల వయసులో, April 10 2013లో ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా చనిపోయాడు. అన్నట్లు సూర్య సేన్ కి నమ్మకద్రోహం చేసి పట్టించిన వాడి గురించి చెప్పలేదు కదా, సూర్య సేన్ ని పట్టించిన నేత్ర సేన్ ని అతని ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తి నరికి చంపాడు. ఈ సమయంలో నేత్ర సేన్ భార్య అక్కడే ఉన్నా… తన భర్తని చంపింది అనే విషయం మాత్రం బయటకి చెప్పలేదు. సూర్య సేన్ మరణం, తర్వాతి కాలంలో ఎందరో వీరులకి స్ఫూర్తినిచ్చింది. సూర్య సేన్ ఉన్న జైలుని, బాంగ్లాదేశ్ ప్రభుత్వం హిస్టారికల్ ప్లేస్ గా గుర్తించింది. ఆ దేశ చరిత్రలో సూర్య సేన్ గురించి పాఠాలు కూడా ఉన్నాయి కానీ మనం మాత్రం మర్చిపోయాం. 2010లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్ హీరోగా ఖేలే హమ్ జీ జాన్ సే అనే సినిమా వచ్చింది, ఆ తర్వాత రెండేళ్లకి మనోజ్ బాజ్పాయ్ హీరోగా చిట్టగాంగ్ సినిమా వచ్చింది. ఈ రెండు ఆశించిన స్థాయిలో ప్రజాధారణ పొందలేదు… కారణం సూర్య సేన్ ని మనం మర్చిపోవడమే… చిట్టగాంగ్ ఆర్మోరి రైడ్ గుర్తున్న మనకి దాన్ని అమలు పరిచిన సూర్య సేన్ గుర్తులేడు. గుర్తుంచుకోవాల్సిన ఎన్నో మర్చిపోతున్నాం, మర్చిపోవాల్సినవి ఎన్నో గుర్తు పెట్టుకుంటున్నాం. సూర్య సేన్ లాంటి వీరుల గురించి ఎప్పటికప్పుడు తర్వాతి తరాలకి తెలియజేస్తూ ఉండాలి. అప్పుడే వారు చేసిన పోరాటానికి నిజమైన నివాళి ఇచ్చినట్లు అవుతుంది.

సూర్య సేన్ రాసిన చివరి ఉత్తరంలో… “Death is knocking at my door. My mind is flying away towards eternity. At such a pleasant, at such a grave, at such a solemn moment, what shall I leave behind you? Only one thing, that is my dream, a golden dream – the dream of free India. Never forget the date, 18th of April, 1930, the day of the eastern Rebellion in Chittagong. Write in red letters in the core of your hearts the names of the patriots who have sacrificed their lives at the altar of India’s freedom.”

చిట్టగాంగ్ ఆర్మోరి రైడ్ లో, సూర్య సేన్ పోరాటంలో ఇద్దరు అమ్మాయిల త్యాగం, వీరం రెండూ ఉన్నాయి. కీప్ సపోర్టింగ్ అస్, ఇలాంటి వీరుల జీవితాలు, అన్ సంగ్ హీరోల కథలు మీ దెగ్గర ఉంటే మాకు పంపండి… మన వీరుల గురించి ప్రపంచానికి తెలియజేద్దాం.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.