Tue. Aug 4th, 2020

Sambashana

Telugu News Portal

సాయం చేయని వాడు కూడా మాటలు చెప్తున్నాడు

1 min read
cab nrc bill

కొన్ని సార్లు దేశంలో నిరసనలు ఎందుకు జరుగుతాయి? దానికి కారణం ఏంటి? వాటి వెనక ఎవరు ఉన్నారు అనే విషయాలు లోతుగా ఆలోచిస్తే అంతుబట్టని ఎన్నో విషయాలు బోధపడుతూ ఉంటాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే… పౌరహక్కుల చట్టం గురించి దేశంలో ఎన్నో నిరసనలు జరుగుతున్నాయి, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా కలిపిస్తున్నాయి. పోలీసుల అతి కాసేపు పక్కన పెడితే, నిజంగానే జామియాలో జరుగుతున్నది స్టూడెంట్ ప్రొటెస్ట్ మాత్రమేనా? లేక దాని వెనక రాజకీయ రంగు ఉందా అనే అనుమానం రాక మానదు.

తెలంగాణ రాష్ట్రం కోసం ఓయూ స్టుడెంట్స్ రోడ్ పైకి వచ్చారు, ఉద్యమం ఉరకలెత్తించారు. నిజమే తెలంగాణ రాష్ట్రం రావడంలో విద్యార్థుల పోరాటం చాలా గొప్పగా సాగింది, అయితే దాని వెనక/పక్కన తెరాస పార్టీ అండ కూడా ఉంది. రాజకీయ నాయకులు, స్టూడెంట్స్, సామాన్య ప్రజలూ అందరూ కలిశారు కాబట్టే తెలంగాణ ఉద్యమం అంత గొప్పగా సాగింది. ఇలాగే, ఇప్పుడు జామియాలో జరుగుతున్న పోరాటం వెనక కూడా యాంటీ మోదీ పార్టీ హస్తం ఉంది. మోదీని సపోర్ట్ చేయడమో, బీజేపీని సపోర్ట్ చేయడమో మా ఆలోచన కాదు కానీ వ్యక్తుల ఆలోచన గురించి మాట్లాడే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం.

సిటిజెన్ షిప్ బిల్ వద్దు అనేది కొందరి వాదన, దానికి సరిగ్గా ఆలోచన కూడా లేని కొంతమంది సెలెబ్రిటీలు కూడా వత్తాసు పలుకుతున్నారు. ముస్లిమ్స్ కి తప్ప అందరికీ పౌరసత్వం ఇస్తాము అనేది చాలా పెద్ద తప్పు. బయట దేశం నుంచి వచ్చే వలస వాదులంతా ఒకటే అయినా, వాళ్లని వేరు చేసి చూడడం ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న తప్పు. అది అక్షర సత్యం కూడా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, కొత్తగా పక్క దేశాల నుంచి వచ్చే ముస్లిమ్స్ కి పౌరసత్వం ఇవ్వము అంటున్నారు, దాని వల్ల కొత్తగా వచ్చే వారికి ఇబ్బంది. ప్రస్తుతం జరుగుతున్న పోరాటం కారణంగా ఇది కాస్త మారి, వలస వాదులందరికీ పౌరసత్వం వస్తే అంతకన్నా సంతోషించాల్సిన విషయం ఇంకొకటి లేదు. అందరు బాగుండాలి, అంతా కలిసుండాలి.. ఇదే నా దేశ సిద్ధాంతం అవ్వాలి అని మేము కోరుకుంటున్నాం.

ఇదే సమయంలో, ఎవడో చేసే స్వార్ధమైన పోరాటానికి ఏ ఒక్కరూ బలి కాకూడదూ అని కూడా కోరుకుంటున్నాం. భవిషత్తులో ఇండియా, హిందూ దేశమై పోతుంది… ఇక్కడ ఉండే ముస్లిమ్స్ కి పౌరసత్వం ఉండదు, ఏ హక్కు లేని వాళ్లు అయిపోతారు అనే మాటని కాదు కాదు భయాన్ని ప్రజలకి కలిగించి… ఉన్న సమస్యకి రాజకీయ రంగు పులిమి కొందరు పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో కాస్త ఆలోచించి, సిటిజెన్ షిప్ యాక్ట్ వల్ల ఇక్కడ ఉంటున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్లు ఈ దేశ ప్రజలు, ఈ దేశం వాళ్లది అని రియలైజ్ అయితే బాగుంటుంది. కొత్త చట్టంలో ముస్లిమ్స్ కి కూడా పౌరసత్వం ఇచ్చేలా పోరాటం చేయాలి కానీ ఇప్పుడు ఉంటున్న వారికి కూడా హక్కులు ఉండవు అనే భయం కలిగించి ఉద్యమాలు చేయడం మంచిది కాదు.

“పౌరసత్వ చట్టం వల్ల పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌ దేశాల నుంచి వచ్చిన ముస్లిం శరణార్దులకు పౌరసత్వం లభించదని…ఇండియాలోని ముస్లింలకు మాత్రం దీని వల్ల ఎలాంటి నష్టం లేదు”. ఈ మాట అన్నది, నేనో, ఒక హిందూ మత పెద్దనో కాదు… శ్రీనగర్ కాలనీలోని ప్రముఖ జమా మసీద్ ముఖ్య మత బోధకుడైన షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ అనడం విశేషం. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్ధులపై పోలీసుల హింసాత్మక అణిచివేత అనంతరం దేశంలోని నిరసనకారులు సంయమనం పాటించాలని కూడా బుఖారీ కోరాడు. దయచేసి ఏ ఒక్కరూ సంయమనం కోల్పోయి పోరాటం చేయకుండా… ఓపిక పట్టి, శాంతియుత పోరాటం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ శాంతియుత పోరాటం కారణంగా ప్రతి వలస దారుడికి మన దేశ పౌరసత్వం వస్తుందని ఆశిస్తున్నాం, అలాగే స్వార్ధంతో పావులు కదుపుతున్న రాజకీయ నాయకుల ప్రయత్నాలు కూడా భగ్నం కావాలని ఆశిస్తున్నాం.

చివరి మాట: అంతా బాగుంది కానీ… మీ పోరాటం, మా మాటలు, రాజకీయ నాయకుల ఆలోచనలు కాసేపు పక్కన పెడతాం… అందరికీ పౌరసత్వం కావాలి అంటున్నారు, మరి అందరికీ సరిపోయే తిండి, చేయడానికి పని దొరుకుతుందా? ఒకవేళ నిజంగానే బయట వాళ్లు దేశంలోకి వస్తే, ఒక్కడు అంటే ఒక్కడు కూడా చేతిలో నుంచి రూపాయి తీసి పెట్టాడు, కంచం నుంచి ఒక్క ముద్ద అన్నం పెట్టడు, ఇంట్లో ఇంత చోటు ఇవ్వడు… కానీ సమ న్యాయం కోసం, సమ హక్కుల కోసం, అందరికీ పౌరసత్వం కోసం పోరాటాలు చేస్తున్నారు. ముందు మీ పక్కన ఉన్న వాళ్లకి అండగా నిలబడండి, అమ్మా నాన్నలకి తోడుగా ఉండండి… అది చేత కాదు కానీ నీతులు మాత్రం చెప్తూనే ఉన్నారు. ముందు మనుషులతో మనుషులుగా మెలగడం నేర్చుకోండి. అంతెందుకు ఒక్కసారి మీ ఇంటి చుట్టు పక్కల ఉన్న ముస్లిమ్స్ ఇంటికి వెళ్లి ఈ చట్టాల గురించి అడగండి, ఒక్కడికి అది తెలిసి ఉండదు. చుట్టూ ఉన్న వాళ్లతో, మతంతో సంబంధం లేకుండా కలిసిపోయి ఉంటారు. అది నా దేశానికి కావాల్సిన ఐకమత్యం. అది నా దేశం గొప్పదనం.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.