Sat. Apr 4th, 2020

Sambashana

Online News Portal

మాలో మళ్లీ ముసలం, తప్పు చేసింది ఎవరు?

1 min read
MAA Issue Jeevitha Vs Naresh

ప్రతిపక్షంలో ఉండగా ఎన్నికల్లో అధికార పక్ష నాయకుడు చేసిన తప్పులని వేలెత్తి చూపించి, అధికారంలోకి వచ్చారో అదే తప్పు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లు చేస్తున్నారు. ఏంటి అధికారం, ప్రతిపక్షం, అధికారం పక్షం అంటున్నారు. ఏదైనా పాలిటికల్ వార్తనా అనుకోకండి. ఇది ఫక్తు సినిమా వార్త, సినీ ‘మా’ వాళ్ల వార్త. ఈ నెల 20వ తేదీ ఆదివారం నాడు తెలుగు సినిమా నటీనటుల సంఘం (మా) జనరల్‌ ఆత్మీయ సమావేశం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో జరిగింది. ఈ సమావేశం గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అసలు మీటింగ్ లో ఏం జరిగింది అనేది పక్కన పెడితే, మీటింగ్ తర్వాత జరిగిన పరిణామాలు చాలా అనుమానాలకి అవకాశం ఇచ్చింది.

MAA Issue

సీనియర్‌ నరేశ్‌ అధ్యక్షుడిగా, డా. రాజశేఖర్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జనరల్‌ కార్యదర్శిగా జీవిత రాజశేఖర్‌ ‘మా’ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శత్రువు శత్రువు మనకి మిత్రుడు అన్నట్లు శివాజీ మీద ఉన్న కోపంతో మొదట్లో కలిసి పని చేసిన జీవిత రాజశేఖర్, నరేష్ లు నెమ్మదిగా వర్గాలుగా విడిపోయి పని చేయడం మొదలు పెట్టారు. నరేష్ వర్గం చెప్పింది జీవిత వర్గానికి నచ్చదు. జీవిత వర్గం చెప్పింది వర్గానికి నచ్చదు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మా అసోసియేషన్ కి డబ్బు కొరత ఉంది. రీసెంట్ గా చేసిన పనులు కానీ ఇన్షురెన్స్ రెండు లక్షల నుంచి మూడు లక్షలకి పెంచడం కానీ ఆర్టిస్టులకి ఉపయోగ పడొచ్చు కానీ మా లో డబ్బు కొరతని మాత్రం పెంచేదే. అయితే ఈ ఫండ్స్ కొరత తీర్చడానికి మా అసోసియేషన్ ఒక ఈవెంట్ ప్లాన్ చేయాలి అనుకుంది. ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహణ విషయంలోనే జీవిత రాజశేఖర్ కు, నరేష్ కు మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది.

గతంలో అధ్యక్షుడిగా ఉన్న శివాజీ కూడా మహేశ్ బాబుతో క ఈవెంట్ ప్లాన్ చేసి ఫండ్స్ రైజ్ చేయాలి అనుకున్నాడు కానీ అది ఎందుకో జరగలేదు. శివాజీ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇప్పుడు అధికారంలో ఉన్న నరేష్, శివాజీ టీంపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు చేశాడు. ఇప్పుడు కూడా మా అసోసియేషన్ చేయాలి అనుకున్న ఫండ్ రైజింగ్ ఈవెంట్ కి గతంలో ఏ సంస్థ అయితే అమెరికాలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చిందో అదే సంస్థ, అన్నీ క్లియర్ గా ట్రాన్స్ పెరెంట్ గా వుండేలా ఏర్పాట్లు చేసి, సర్టిఫైడ్ ఆడిటింగ్ నిర్వహిస్తూ, రెండు కోట్లు ఇవ్వడానికి నరేష్ ముందుకు వచ్చిందని, దానికి నరేష్ బ్యాకింగ్ చేస్తున్నాడని తెలుస్తోంది. అంటే గతంలో శివాజీరాజా వర్గంపై ఏ సంస్థ కారణంగా, ఏ ఫండ్ రైజింగ్ కారణంగా నరేశ్ ఆరోపణలు చేశాడో, ఇప్పుడు సంస్థనే నరేష్ సపోర్ట్ చేస్తున్నాడు, దానికి కారణం ఏంటి అనేది అతనికే తెలియాలి. ఒకప్పుడు శివాజీని తిట్టిన నరేష్, అదే విషయంలో ఇప్పుడు ఎందుకు పాత కంపెనీనే కావాలని పట్టుబడుతున్నాడు అనేది అతను మిగిలిన వాళ్లకి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అటు లేని పక్షంలో ఈగోకి వెళ్లినా, వేరే ఏదైనా లాభం పొందుతున్నా నరేష్ తప్పకుండా తప్పు చేస్తున్నట్లే. నరేష్ వర్గానికి, జీవిత రాజశేఖర్ వర్గానికి ఇక్కడి నుంచి అసలు సమస్య స్టార్ట్ అయ్యింది.

మా మంచి కోసం చేయాలి అనుకున్న ఈవెంట్ శివాజీ ఉన్నప్పుడు జరగలేదు, జీవిత రాజశేఖర్, నరేష్ ల కొత్త టీం వచ్చినప్పుడూ జరగట్లేదు. అప్పుడు శివాజీ చేసింది తప్పు అయితే, ఇప్పుడు ఉన్న కార్యవర్గం చేస్తున్నది కూడా తప్పే, అంతర్గత వివాదాలు ఉన్నాయి పరిష్కరించుకోలేకపోయాము అని స్వయంగా జీవిత స్టేట్మెంట్ ఇచ్చింది అంటేనే అంతర్గత గొడవలు, ఆధిపత్య వివాదాలు ఎంత దూరం వెళ్లాయో అర్ధమవుతుంది. ఇదే విషయంపై మాట్లాడిన జీవిత, ‘మా’ సభ్యులు 900పైగా వున్నారు. అందులో 20శాతం మంది సభ్యులు ఆమోదం తెలిపితే ఎక్స్‌ట్రాడినరీ జనరల్‌ బాడీ జరుగుతుంది. అప్పుడే ‘మా’ సమస్యలు పరిక్షరించుకోవడానికి అవకాశం వుంటుంది. 20శాతం సభ్యులు ఆమోదం తెలిపితే అప్పటి నుంచి 21రోజుల్లోగా మీటింగ్‌ పెట్టుకోవాల్సి వుంటుంది. ఇలా మీటింగ్‌ జరిగితేనే అందరికీ మంచి జరుగుతుంది. కనుక సమస్యలు పరిష్కారం కావాలని కోరుకునే సభ్యులందరూ ‘మా’ ఆఫీసుకు రండి. సాధ్యం కాకపోతే ఈమెయిల్‌ ద్వారానో, పోస్ట్‌ ద్వారానో, ఆఫీసుకు వచ్చే వీలున్నవారు వచ్చి సంతకాలతోనో ఆమోదం తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని చెప్పింది. అందరినీ కలుపుకోని పోయి సమస్యని పరిష్కారించాల్సిన చోట, 20 శాతం మంది మద్దతు తెలపండి సమస్యలు పరిష్కరిస్తాము అంటే మిగిలిన వాళ్ల అభిప్రాయంతో సంబంధం లేదా. ఇది విభజించి పాలించడానికి ప్రతి రూపం కదా.

ఆ 900లో 20 శాతం మంది అంటే 180 మంది ముందుకి వచ్చినా చాలు అనే మాట అధికారంలో ఉన్న వ్యక్తి ఎప్పటికీ అనకూడదు. అందరూ రండి అనాలి వాళ్లు రాకపోతే, రావడానికి అవసరమైన చర్యలు తీసుకోండి. ఏ అధికారంలోకి రావడానికి మద్దతు ఇవ్వండి అని ప్రతి పెద్ద హీరో ఇంటికీ కలిసే వెళ్లారు కదా, మీ సమస్యలు మీరు కలిసి పరిష్కారించుకోలేరా? ఈ వివాదాలని, స్వార్ధాలని కాసేపు పక్కన పెట్టి ఆర్టిస్టులకు ఏం చేయాలి, ఏం చేస్తే మా బాగుంటుంది అనేది ఆలోచించే పరిస్థితులో ఇప్పుడు ఉన్న ప్యానెల్ మెంబెర్స్ లేకపోవడం బాధాకరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.