Tue. Aug 4th, 2020

Sambashana

Telugu News Portal

అనగనగా దక్షిణాదిలో… ఉయ్యాలవాడ కంటే నాలుగు దశాబ్దాల ముందు…

1 min read

పరసి రాజా… ఈ పేరు వినగానే అతని కథ ఎవరికీ తెలియక పోవడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు కానీ కనీసం అతనో దక్షినాది స్వాతంత్య్ర సమరయోధుడు అన్న విషయం అయినా మీకు తెలుసా. ఆపవయ్యా భలే చెప్పొచ్చావు, మాకు మా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించే చిరంజీవి, సైరా చేసే వరకు మాకు తెలియదు, ఇంకొక్కడో పరసి రాజా గురించి మాకు ఎలా తెలుస్తది అనకండి, ఇప్పుడు మీరు మా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి… మా రేనాటి వీరుడు… మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు అని బీరాలు పోతున్నారు కదా పరసి రాజా ఉయ్యాలవాడ కన్నా నాలుగు దశాబ్దాల ముందే దేశం కోసం తెల్ల దొరలపై పోరాటం చేసిన యోధుడు. అసలు ఎవరు ఈ పరసి రాజా… అతని కథ ఏంటి? దేశం కోసం అతను చేసిన పోరాటం ఏంటి? ల్యాండ్ ఆఫ్ గాడ్ గా పేరున్న కేరళ గడ్డపై తెల్లదొరలపై పరసి రాజా చేసిన పోరాటం మీకోసం…

1753 జనవరి 3న కొట్టాయం రాజ్యంలో కేరళ వర్మ వంశంలో పుట్టిన వారియర్ ప్రిన్స్ పరసి రాజా. కలరి పట్టులో దిట్ట అయిన పరసి రాజా, 1774 నుంచి 1805 అంటే 31 ఏళ్ల పాటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదురుతిరిగి కత్తి దూసిన వీరుడు. Cotiote యుద్ధంగా బ్రిటిష్ అధికారులు పేరు పెట్టిన ఈ యుద్ధంలో తెల్లదొరలకి ఘర్జించే సింహంలా కనిపించి ఉంటాడు అందుకే, కేరళ సింహంగా పరసి రాజాని భయంతోనే పిలుచుకునే వారు. 1792లో, మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో… ఈస్ట్ ఇండియా కంపెనీ 1790 చేసుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ కొట్టాయం ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోని అక్కడ అప్పటికే ఉన్న రాజులకి భరణం ఇస్తామని చెప్పారు. ఇది నచ్చని 1793లో మొదటిసారి బ్రిటిషర్లకి ఎదురు తిరిగాడు, పెద్ద ఎత్తున జనాలని పోగేశాడు. 1796లో పరసి రాజాని అరెస్ట్ చేయాలని తెల్లదొరలు చాలా ప్రయత్నించారు కానీ గెరిల్లా పోరాటంలో ఆరితేరి, యుద్ధ కళల్లో నైపుణ్యం ఉన్న పరసి రాజా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా ఉరిమి ఆయుధాన్ని చేతపట్టి పరసి రాజా కలరిపోరాటం చేస్తుంటే అతని ఎదురు నిలబడడానికి కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులు వణికిపోయారు. ఎవరి ప్రాణం ఎటుతుందో, ఎవరి ఒంట్లో ఏ భాగం తెగిపడుతుందో కూడా అర్ధం కాని పరిస్థితికి శత్రువులు వెళ్లిపోయారు. ఇలా అయిదేళ్ల పాటు జరిగిన పోరాటంలో పరసి ధాటికి తట్టుకోలేక రవి అస్తమించని బ్రిటిష్ సైన్యం కూడా శాంతి జపం చేసింది. ఎన్నిసార్లు కేరళ వీరుడిని ఆపే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోవడంతో చివరకి చేసేదేమి లేక బ్రిటిషర్లు 1797లో పరసి రాజా ముందు తలొంచారు. బహుశా తెల్లదొరలపై దక్షిణాది భారతీయుడు సాధించిన మొదటి విజయం ఇదేనేమో.

1797 నుంచి మూడేళ్ల పాటు శాంతి శాంతి అంటూ తిరిగిన ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ మూడేళ్ల కాలంలో పరసి రాజా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక అంతా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటుంటే, వాయనాడ్ లో మళ్లీ సునామి మొదలైంది. అయిదేళ్ల పాటు పరసి రాజా అలుపెరగని పోరాటం చేశాడు, ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం కొట్టాయం వైపు తిరిగి చూసేలా చేశాడు. చివరికి 1805 నవంబర్ 30న చిన్న నది ఒడ్డున మావిల తోడు అనే ప్రాంతంలో జరిగిన పోరాటంలో తుపాకీ గుండుకి మరణించాడు. ఒక వీరుడు నేలకొరిగిన సమయం అది, తెల్ల దొరలకి మన సత్తా ఏంటో తెలియజేసిన సమయం అది. పరసి రాజా లాంటి వాడు మరొకడు పుడితే ఎలా అనే ఆలోచనే ఈస్ట్ ఇండియా కంపెనీ వెన్నులో వణుకు పుట్టించి ఉంటుంది, అందుకే కలరిపట్టుని నిషేదించింది. మన ప్రాచీన యుద్ధ కళగా పేరున్న కలరిపట్టు మన దేశంలోనే కనిపించకుండా పోయింది. ఆ తర్వాత బయట దేశాల్లో వివిధ పేర్లతో ప్రాచుర్యంలోకి వచ్చింది కానీ మన దేశంలో మాత్రం ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. దేశం కోసం పోరాడిన వీరుడినే మర్చిపోయాం మనం, ఇక ఆ యుద్ధ కళ మర్చిపోవడంలో తప్పులేదు.

పరసి రాజా మరణించిన నాలుగు దశాబ్దాల తర్వాత రాయలసీమలోని కర్నూల్ ప్రాంతంలో రేనాటి సూర్యుడు, ఈస్ట్ ఇండియా కంపెనీపై పోరాటం చేసి ఫిబ్రవరి 22 1847లో మరణించాడు. ఇప్పుడు ఉయ్యాలవాడ కథతో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్నాడు, అతన్నే మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు అంటున్నాడు. నిజానికి ఉయ్యాలవాడ ఆగమనానికి కన్నా ముందే వందల పోరాటాలు జరిగాయి, వేల మంది వీరులు నేలకొరిగారు. ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నట్లే, అనగనగా దక్షిణాదిలో… ఉయ్యాలవాడ కన్నా నాలుగు దశాబ్దాల ముందే తెల్ల దొరలపై తిరుగుబాటు జెండా ఎగరేసి పోరాటం చేసిన వీరుడు మా పరసి రాజా అని చెప్పుకునే రోజు వస్తే బాగుండు. కేవలం పరసి రాజు గురించి మాత్రమే కాదు… దేశం కోసం పోరాడి, అన్-సంగ్ హీరోస్ గా మిగిలిపోయిన ప్రతి ఒక్కరి గురించి మన ఈ సినిమాల ద్వారా అయినా తెలుసుకునే అవకాశం వస్తే బాగుంటుంది. అయితే చరిత్రని యథావిధిగా చెప్తే బాగుంటుంది కానీ ఎవరి స్వార్ధం కోసం వాళ్లు తన సినిమాలోని వీరుడు మాత్రమే గొప్ప అని చెప్పుకుంటూ పోతే మాత్రం చరిత్రకే మచ్చ తెచ్చిన వారు అవుతారు.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.