Tue. Aug 4th, 2020

Sambashana

Telugu News Portal

సైరాలో తమన్నా ఫిక్షనల్ క్యారక్టర్ రా… ఈ కుయిలీ ఒరిజినల్

1 min read
kuyili

మనలో చాలా మంది సైరా సినిమాని చూసే ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్, నయనతార, తమన్నా లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ పాన్ ఇండియా సినిమా చిరు కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జట్ తో తెరకెక్కింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ రోల్ చేసింది. ఇప్పటి వరకూ చేసిన గ్లామర్ రోల్స్ కి కంప్లీట్ వేరియేషన్ చూపిస్తూ, పాటలతో ప్రజల్లో చైతన్యం తెచ్చే వీరనారిగా కనిపించింది. సైరా క్లైమాక్స్ లో బ్రిటిషర్లు తమన్నాని పట్టుకోని వెళ్లి, ఆమెతో నాట్యం చేయిస్తారు, డాన్స్ అయిపోయే సమయానికి బ్రిటిష్ అధికారులు, నరసింహారెడ్డిని పట్టుకోవడానికి మందు గుండు సామాగ్రి తెచ్చారని తెలుసుకోని, తనకి తాను నిప్పంటించుకొని ఆ మందు గుండు సామాగ్రి ఉన్న స్థావరాన్ని పూర్తిగా ద్వంసం చేస్తుంది. ఈ సీన్ ని తెరపై చూసిన ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబొడుచుకోని ఉంటాయి కానీ సరిగ్గా ఇలాంటి సంఘటనే మన చరిత్రలో నిజంగా జరిగింది అంటే మీరు నమ్మగలరా? ఈరోజు అన్-సంగ్ హీరోస్ స్టోరీ చదివాకా, సైరా తమన్నా క్యారెక్టర్ ఫిక్షనల్ రా, ఈ అమ్మాయి కథ ఒరిజినల్ అని మీరూ అంటారు. లెట్స్ గెట్ స్టార్టెడ్…

అది 1780వ సంవత్సరం… తన భర్తని చంపి, రాజ్యాన్ని సొంతం చేసుకున్న బ్రిటిషర్లపై శివగంగై మహారాణి “రాణి వేలు నాచియర్” ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న సమయం. భర్త చనిపోయిన తర్వాత 8 ఏళ్ల పాటు అజ్ఞాతంలో గడిపిన వేలు నాచియర్, తన ప్రజల యొక్క బాధలను తీర్చడం కోసం బ్రిటిషర్లని ఓడించి తిరిగి తన రాజ్యం సొంతం చేసుకోవాలని ప్రణాళిక రచించింది. ఇందుకోసం గోపాల నాయకర్, హైదర్ అలీ అనే ఇద్దరు రాజుల సాయం తీసుకుంది. యుద్దానికి సిద్దమైన రాణి వేలు నాచియర్, తన సైన్యం భాద్యతలని కుయిలీ అనే అమ్మాయికి అప్పగించింది.

పొలం పనులు చేసుకునే దంపతులకు పుట్టిన కుయిలీ, చిన్నప్పటి నుంచే ధైర్యానికి మారుపేరుగా ఉండేది. జంతువుల నుంచి, ఆగంతకుల నుంచి పొలాన్ని కాపాడుకునే పనిలో భాగంగా కుయిలీ తల్లి ప్రాణాలు కోల్పోయింది. తల్లి చనిపోవడంతో కుయిలీని గోముగా పెంచుకున్న తండ్రి, కుయిలీకి నెమ్మదిగా తన తల్లి సాహసాల గురించి, ఆమె ధైర్యం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ప్రపంచంలో తల్లిని మించిన వీరులు ఎవరు లేరు కదా, అందుకే తన తల్లి కథ నుంచే కుయిలీ పోరాట పాఠాలు నేర్చుకుంది. తండ్రి రాణి దగ్గర పని చేయడం మొదలు పెట్టిన తర్వాత నెమ్మదిగా కుయిలీ కూడా అదే బాట పట్టింది. ముక్కుసూటి తనం, తెగింపు, పౌరుషం, నాయకత్వ లక్షణాలు అతి తక్కువ కాలంలోనే కుయిలీని వేలు నాచియర్ కి దగ్గర చేశాయి.

బ్రిటిషర్లు శివగంగై రాజ్యాన్ని సొంతం చేసుకున్న తర్వాత రాణి వేలు నాచియర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఈ సమయంలో వేలు నాచియార్ ఆచూకి తెలుసుకోవడానికి బ్రిటిషర్లు, శివగంగై రాజ్యంలోని దళితులపై దాడులు దారుణాలు చేయడం మొదలుపెట్టారు. తన వాళ్ల కష్టాలు చూడలేక కుయిలీ దాడులు చేసే వారిపై తిరగబడింది. దీంతో బ్రిటిష్ సైన్యం, కుయిలీని పట్టుకున్నారు. వేలు నాచియార్ ఆచూకి చెప్పమని హింసించారు, ఎంత ఇబ్బంది పెట్టిన రాణి గురించి, ఆమె తిరుగుబాటు ప్రణాళిక గురించి చెప్పని కుయిలీ, జైలు నుంచి బయటకి వచ్చాక రాణి వేలు నాచియార్ దేవి సర్వసైన్యధ్యక్షురాలు అయ్యింది. ఒంటరిగానే తెల్లదోరాలకి ఎదురేల్లిన కుయిలీ, సైన్యం కూడా తోడుంటే వెనకడుగు వేస్తుందా? ఆకశమే హద్దుగా చలరేగి పోయింది, అజ్ఞాతంలో ఉంటూనే తిరుగుబాటు జండా ఎగరేసింది. బ్రిటిషర్లపై దాడులు చేస్తూ ఆయుధాలు సమకూర్చింది.

కావాల్సిన అండ దొరికింది, సరైన సమయం కూడా కుదిరితే రాజ్యంలోకి ప్రవేశించి బ్రిటిషర్లని తరిమి కొట్టడమే తరువాయి అనుకున్న రాణి వేలు నాచియార్, శివగంగై కోటలోకి మహిళను అనుమతించడం గురించి సమాచారాన్ని సేకరించింది. నవరాత్రులు పదవ రోజు కావడంతో రాజ్యంలోని రాజరాజేశ్వరి ఆలయంలో ఘనంగా జరుపుకునే విజయదశమి పండుగకు అనుమతినిస్తూ బ్రిటిషర్లు కోటలోకి రావడానికి ఆడవారికి అనుమతి ఇచ్చారు. ఈ నిర్ణయమే వారిపాలిట యమపాశం అవుతుందని వారు ఆరోజు ఊహించి ఉండరు. ఈ నిర్ణయం కారణంగా శివగంగై కోటనే కాదు ప్రాణాలు కూడా కోల్పోతున్నాం అని వారు గ్రహించలేక పోయారు. బ్రిటిషర్లు అనుమతి ఇచ్చినట్లే ఆడవారు, అమ్మవారికి పెట్టే పువ్వులు పండ్లని గంపలు గంపలుగా తీసుకొని కోటలోకి ప్రవేశించారు. గంపల్లోని పూలు పండ్ల మాటున దాడికి సిద్దంగా ఉన్న గాయపడ్డ సింహం ఉందనే విషయం తెల్లదొరలు తెలుసుకునే సరికే, కోటలోకి రాణి సైన్యం అంతా వచ్చి చేరింది. ఊహించని యుద్దానికి సన్నధంగా లేని శత్రువులపై కుయిలీ తన సైన్యంతో విరుచుకు పడింది. ఎదురు పడిన ప్రతి బ్రిటిష్ సైనికుడిని తన అంబుకి జవాబుదారి చేసింది.

నిప్పుకణమై చలరేగుతున్న కమాండర్ ఇన్ చీఫ్ కుయిలీకి, రాణి వేలు నాచియార్ కూడా తోడయ్యింది. ఇద్దరూ కలిసి, తమ రాజ్యాన్ని సొంతం చేసుకున్న వారి ప్రాణాలని గాల్లో కలపడమే పనిగా పెట్టుకున్నారు. గంపల్లో గుంపుగా వచ్చిన సైన్యం కూడా దాడి చేయడం మొదలుపెట్టారు. ఆరాత్రి కుయిలీనీ చూస్తే విజయదసమి నాడు అమ్మవారే స్వయంగా దిగొచ్చి కాళీ అవతారంలో ప్రళయ తాండవం చేస్తుందా అనే అనుమానం వచ్చేలా యుద్ద భూమిలో కదులుతుంది. మెరుపు దాడులు చేస్తున్న కుయిలీకి బ్రిటిష్ సైన్యం ఆయుధాలను ఉంచిన స్థలం కనపడింది. ఆ ఆయుధ కర్మాగారాన్ని ద్వంసం చేస్తే యుద్ధం గెలిచినట్లే అని తెలుసుకున్న కుయిలీ, గుడిలో దీపాలను వెలిగించడానికి తెచ్చిన ఆవు నెయ్యిని ఉపయోగించి కొత్త చరిత్ర రాసింది.

ఆయుధ స్థావరాన్ని లేకుండా చేస్తే తెల్లదోరాలని యుద్దభుమిలో నిస్సహాయులని చెయ్యొచ్చని భావించిన కుయిలీ, తన సహచరులకి నెయ్యిని తనపై పోయమని ఆజ్ఞాపించింది. ఆమె ఏం చేయబోతుందో గ్రహించిన సైన్యం, అందుకు నిరాకరించారు. ఎన్నిసార్లు అడిగినా తనపై నెయ్యిని పోయడానికి సైన్యం ఒప్పుకోకపోవడంతో… కుయిలీ సైన్యధ్యక్షురాలి హోదాలో సైన్యానికి తనపై నెయ్యి పోయమని ఆదేశించింది. నిలువెత్తు నెయ్యిలో తడిచిన కుయిలీ, ఆయుధ కర్మాగారం వైపు కదలడం మొదలుపెట్టింది. అడ్డొచ్చిన ప్రతి బ్రిటిష్ సైనుకుడిని చీల్చి చండాడుతూ ముందుకి కదిలింది. ఎగసిపడుతున్న నిప్పు కణమై కదులుతున్న కుయిలీ, ఆయుధ కర్మాగారం చేరుకోగానే తనకి తానే నిప్పంటించుకుంది. మందు గుండు సామాగ్రి ఉన్న ఆ స్థావరం మంట తగలగానే పేలిపోయింది.

ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మనవ బాంబుగా మారిన కుయిలీ, రాణి వేలు నాచియార్ శివగంగై రాజ్యాన్ని తిరిగి సొంతం చేసుకోవడంలో ముఖ్యపాత్ర పోషించింది. 1857 అధికారికంగా తెల్లదొరలపై భారతీయులు తిరుగుబాటు చేసిన సంవత్సరం, ఇంతకన్నా 85 ఏళ్ల ముందే చేసిన ఈ తిరుగుబాటు మనలో చాలా మందికి తెలియదు. సైరాలో తమన్నా గుర్తున్న మనవాళ్లకి ఆ కథని నిజం చేసిన కుయిలీ గురించి తెలియకపోవడం బాధాకరం. దళపతి, వీరమని అనే పేర్లతో కుయిలీని ప్రేమగా పిలుచుకునే తమిళ ప్రజలు… కుయిలీ కథని ప్రపంచానికి తెలియజేయడంలో విఫలం అయ్యారు. అక్కడి ప్రభుత్వం మాత్రం కుయిలీ కీర్తి స్మారక స్తూపాన్ని శివగంగ జిల్లలో స్థాపించారు. ఇంతటి ఘనత సాదించిన కుయిలీ ఎలా ఉంటుందో మీకు చెప్పలేదు కదా… జుట్టుని జూలులా విదిలించి, బల్లం పట్టుకున్న సింహంలా ఉంటుంది. నమ్మకపోతే కింద ఫోటోని చూడండి, కుయిలీ కదులుతున్న కాళీమాతలా కనపిస్తుంది.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.