Tue. Aug 4th, 2020

Sambashana

Telugu News Portal

శ్రీశైల భక్తుల కోసం దేవస్థానం కొత్త నిర్ణయం

1 min read
Srisailam Devasthanam

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి అరికట్టేందుకు దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన శ్రీశైలమహాక్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాలను రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు నిలిపివేశారు. దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం శ్రీశైల పరోక్ష సేవ పేరుతో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పరోక్ష ఆర్జిత సేవలను ప్రవేశపెట్టింది. ఈ పరోక్ష సేవకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీశైలానికి భక్తులు స్వయంగా రాకుండా వారి ఇంటి వద్దే ఉంటూ జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునుడి విశేష పూజల్లో పాల్గొనవచ్చు.

భక్తులు ఆన్ లైన్ ద్వారా రుసుం చెల్లించి ఆర్జిత సేవలను పరోక్షంగా జరిపించు కోవచ్చు. పరోక్ష సేవల్లో గణపతి హోమం, రుద్ర హోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం, భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కళ్యాణం, రుద్రాభిషేకం కుంకుమార్చన సేవలను జరిపించుకోవచ్చు. సేవా కర్తలు వారి పేరున జరిగే సేవలు-విశేషాలు వీక్షించేందుకు వీలుగా దేవస్థానం యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ఆయా సేవలను ప్రత్యక్ష ప్రసారాలు చేస్తారు. కేవలం రుద్రాభిషేకం కుంకుమార్చన సేవలు మాత్రం లైవ్ చూపించరు. పూజల అనంతరం సాయంత్రం భక్తుల గోత్రనామములతో వేద ఆశీర్వచనం చెబుతారు. రూ.1,116 రుసుం ను దేవస్థానం వెబ్ సైట్ క్యూ ఆర్ కోడ్ ను ఉపయోగించి గూగుల్ పే, ఫోన్ పే, BHIM, పేటీఎమ్ ద్వారా సేవ రుసుం చెల్లించే సదుపాయం కల్పించారు. శ్రీశైల మహాక్షేత్రం దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి గాంచిన క్షేత్రం కావడంతో శ్రీశైలమల్లికార్జున స్వామి దర్శనానికి, స్వామి ఆశీస్సులకు వివిధ దేశాలకు, రాష్ట్రాలకు చెందిన భక్తులు ఆరాటపడతారు. ఇందుకోసం ప్రస్తుతం శ్రీశైల క్షేత్రంలో ప్రవేశపెట్టిన పరోక్ష సేవ గురించి భక్తులకు తెలియజేసేందుకు తెలుగు, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో శ్రీశైల దేవస్థానం విస్తృత ప్రచారం కల్పిస్తుంది.

శ్రీశైల దేవస్థానం ఏప్రిల్ 13వ తేదీ నుంచి శ్రీశైల పరోక్ష సేవ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పటినుంచి ఇప్పటివరకు 7070 మంది పైగా భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు నిర్వహించే పరోక్ష ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. తద్వారా దేవస్థానానికి సుమారుగా 70 లక్షలకు పైగా ఆదాయం లభించింది. ఎక్కువ మంది భక్తులు చండీహోమం, మృత్యుంజయ హోమం పూజలు నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుత సమయంలో భక్తులు రాక ఎటువంటి ఆదాయం లేని దేవస్థానానికి ఎంతో కొంత ఊరటగా పరోక్ష సేవ ద్వారా ఆదాయం లభిస్తుంది. పరోక్ష సేవ ప్రారంభ పూజను శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దంపతులు మొదటి పూజ నిర్వహించుకున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు శ్రీశైల దేవస్థానం ప్రవేశపెట్టిన శ్రీశైల పరోక్ష సేవకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుందని శ్రీశైల దేవస్థాన అధికారులు తెలియజేస్తున్నారు.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.