Tue. Aug 4th, 2020

Sambashana

Telugu News Portal

డైరెక్టర్ ఆఫ్ ది డికేడ్… డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాధ్

1 min read
puri jagannadh

స్టార్ ఆఫ్ డికేడ్ లో ఈ వీక్… ఒక డైరెక్టర్ గురించి చెప్పబోతున్నాం… హీరో అనే పదానికే కొత్త అర్ధం చెప్పిన దర్శకుడు అతను, కథనాన్నే కొత్తగా చూపించిన రైటర్ అతను. హిట్ ఉంటేనే ఇండస్ట్రీలో ఉంటాం అనే మాటని అబద్దం చేస్తూ… టాలెంట్ ఉంటే చాలు అవకాశాలు వెత్తుకుంటూ వస్తాయి అనే నమ్మకం కలిగించిన దర్శకుడు అతను. ఇంతకీ ఈ అతను ఎవరు అనే కదా మీ డౌట్… మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ స్టార్ ఆఫ్ ది డికేడ్…

పేజిలకి పేజీలు డైలాగులు రాసే చోట, బుల్లెట్ పాయింట్ లాగా ఒక్క డైలాగ్ తో హీరోని ఎలివేట్ చేయగల దిట్ట… 100 సినిమాలు చేసిన హీరోని కూడా, 101వ చిత్రంలో కొత్తగా చూపించగల సత్తా ఉన్న దర్శకుడు… మూవీ అనౌన్స్ టైంలోనే రిలీజ్ డేట్ తో సహా చెప్పేంత గ్రిప్ ఉండే కాన్ఫిడెంట్ టెక్నీషియన్… ఈ మాటలు అన్నీ ఒక్క మనిషి గురించే అయితే, అతని పేరు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఏ అవుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఎవడు సినిమా తీస్తే, బాక్సాఫీస్ బద్దలవుతుందో ఆడే పూరి జగన్నాధ్.

సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం… ఏప్రిల్ 20 2000న మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి సినిమాతోనే అన్నకి తగ్గ తమ్ముడు, రెండో సినిమాకే ఫ్యూచర్ స్టార్ అనే కాంప్లిమెంట్స్ అందుకున్న పవన్ కళ్యాణ్… తన మూడో సినిమాని ఒక కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు, ఎవడో పూరి జగన్నాధ్ అంట.. మన పవన్ తో బద్రి అనే సినిమా తీశాడని ప్రతి మెగా అభిమాని థియేటర్స్ కి వెళ్లారు. అప్పటివరకూ చేసిన రెండు సినిమాల్లో చూసిన పవన్ కళ్యాణ్ కి బద్రి సినిమాలో చూసిన పవన్ కళ్యాణ్ ని ఎంతో తేడా కనిపించింది. అతని డైలాగ్ డెలివరి, స్క్రీన్ ప్రెజెన్స్ పూర్తిగా మారిపోయాయి. సినిమా చూడడానికి వెళ్లిన మెగా ఫ్యాన్స్, కొత్త పవన్ కళ్యాణ్ ని చూసి కాలర్ ఎగరేసుకొని బయటకి వచ్చారు. వాళ్లకి తెలియదు, పవన్ కళ్యాణ్ లో మార్పు వెనక పూరి జగన్నాధ్ అనే పేరు ఉందని. సినీ అభిమానులే కాదు, ఇండస్ట్రీ వర్గాలు కూడా బద్రి సినిమా చూశాక, ఎవర్రా ఈ డైరెక్టర్ అనే తిరిగి చూసేలా చేశాడు. అప్పట్లో వర్మ తీసిన శివ ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో ఈ జనరేషన్ వాళ్లకి తెలియదు కానీ బద్రి ఇంపాక్ట్ మాత్రం అందరికీ తెలుసు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు అవుతున్నా, నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్ అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తుంది అంటే, బద్రి ఇంపాక్ట్ ఏ రేంజులో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన అడ్వాన్స్ తో పూరి, కేవ్ అనే ఆఫీస్ పెట్టాడు. చేతిలో ఉన్నవి సరిపోక పోతే అప్పు చేసి మరీ ఆఫీస్ ని రెడీ చేశాడు. గ్యారెంటీ లేని ఇండస్ట్రీలో తనపై తనకి ఎంత నమ్మకం ఉంటే ఒక మనిషి అప్పు చేసి మరీ ఆఫీస్ తీస్తాడు. పూరి కేవ్స్ అనే ఆఫీస్ విషయం, అప్పట్లో ఒక సంచలనం. అయితే గ్రాండ్ గా అప్పు చేసి ఆఫీస్ ఓపెన్ చేశాడు కానీ దర్శకుడిగా అవకాశాలు మాత్రం అంత ఈజీగా రాలేదు.

బద్రి హిట్ కొట్టినప్పటికీ, రెండో సినిమా అవకాశం వెంటనే రాకపోవడంతో, పూరి… పవన్ తమ్ముడు సినిమాని కన్నడలో యువరాజగా రీమేక్ చేసాడు. మొదటి సినిమాకే కన్నడలో కూడా సూపర్ హిట్ కొట్టాడు. అక్కడ అవకాశాలు వచ్చాయి కానీ వద్దన్న చోటే నిలబడాలి అనుకున్నాడో ఏమో కానీ తెలుగులోనే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. జగపతిబాబుతో రెండో సినిమా చేశాడు కానీ అది కూడా ఆశించిన రిజల్ట్ రాలేదు. దీంతో హిట్టే కొలమానం అయిన ఇండస్ట్రీలో పూరికి చోటు లేదు అనుకున్నారు. అందరూ అనుకున్నట్లు అయితే అది జీవితం ఎందుకు అవుతుంది, ఓటమిని వెంటనే ఒప్పుకుంటే అతను పూరి జగన్నాధ్ ఎందుకు అవుతాడు. అప్పటివరకూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన రవితేజని హీరోగా పెట్టి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా చేశాడు. సూపర్ హిట్ అయిన ఈ సినిమా కథ, కథనం చాలా కొత్తగా కనిపిస్తాయి. దీని తర్వాత ఇడియట్, అమ్మ నాన్న ఒక తమిళమ్మాయి సినిమాలతో హిట్స్ ఇచ్చి మూడేళ్ళ పాటు పూరి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ మూడు సినిమాలతో రవితేజ సోలో హీరోగా కాదు… కాదు స్టార్ హీరోగా ఎదిగాడు. ఒక సైడ్ హీరోని స్టార్ హీరో చేసిన ఘనత పూరి జగన్నాధ్ సొంతం. రవితేజ కెరీర్ మొత్తంలో ఎవరికైనా రుణపడి ఉన్నాడా అంటే అది పూరికి మాత్రమే. ఈ మూడు సినిమాలతో పూరి టేకింగ్ అండ్ డైలాగ్ రైటింగ్ కే కాదు… హీరో క్యారెక్టర్ డిజైనింగ్ కి కూడా ఒక మార్క్ ఏర్పడింది. ఇడియట్ సినిమా చూసిన వాళ్లు, హీరో హీరోయిన్ కి ఇలా కూడా ప్రొపోజ్ చేస్తాడా అని ఆశ్చర్యపోయారు, అదే టైములో కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు.

ఇండస్ట్రీలో ఉండడానికి కావాల్సిన హిట్ ఇచ్చేశాడు, ఇక ఇండస్ట్రీలో నిలబడడానికి కావాల్సిన హిట్ కొట్టాల్సిన సమయం వచ్చింది. వరుస హిట్లతో ఉన్నపూరికి మొదటి సారి నాగార్జున లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకుంటూ శివమణి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. నా పేరు శివమణి, నాకొంచెం మెంటల్ అనే డైలాగ్ నాగార్జున చెప్తుంటే, అక్కినేని అభిమానులు థియేటర్స్ లో విజిల్స్ వేశారు. శివమణి 9848022338 అనే నంబర్ కూడా ఎవరూ మర్చిపోయి ఉండరు. ఒక పవర్ఫుల్ పోలీస్ కథకి, పూరి మార్క్ కథనం ఎస్సెట్ అయ్యింది.

పూరి ఖాతాలో వరసగా నాలుగో హిట్.. ఇక ఇండస్ట్రీలో పూరికి తిరుగు లేదు అనుకున్నారు… కానీ కాలం ఇంకోలా ఆలోచించింది. పూరి టైం రివర్స్ అయ్యింది. ఆకాశంలో ఉన్న ఇమేజ్, తలకిందులు అయ్యింది. 2004-2005 మధ్యలో నాలుగు సినిమాలు చేశాడు కానీ ఒక్క హిట్ కూడా పడలేదు.

శివమణి లాంటి కమర్షియల్ హిట్ ఇవ్వడంతో… ఎన్టీఆర్ లాంటి స్వింగ్ లో ఉన్న హీరో పూరీని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వడంతో, పూరి ఆంధ్రావాలా సినిమా చేశాడు. ఎన్టీఆర్ డబుల్ రోల్ లో నటించడం, మొదటిసారి తండ్రి కొడుకులుగా కనిపించడంతో ఆంధ్రావాలాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ ఆడియో లాంచ్ జరిగినంత గ్రాండ్ గా, ఇప్పటికి వరకూ ఏ సినిమా ఫంక్షన్ జరగలేదు అంటూ అతిశయోక్తి కాదు. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆంధ్రావాలా ఊహించని ఫ్లాప్ గా నిలించింది. ఈ దెబ్బకి పూరి మరో రెండు మూడేళ్ల పాటు కోలుకోలేకపోయాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్… వరసగా హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఇచ్చాడు. దీంతో మళ్లీ పూరి జగన్నాధ్ పని అయిపొయింది అనుకున్నారు.

అందరి అంచనాలని తలకిందులు చేస్తూ… పూరి, సూపర్ స్టార్ మహేశ్ తో మూవీ చేశాడు. పోకిరి సినిమాతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి, కొత్త రికార్డులని సృష్ఠించాడు. తెలుగు సినిమా కల్లెక్షన్ల బూజు దులిపిన సినిమాగా పోకిరి నిలిచిపోయింది. వసూళ్ల పరంగానే కాకుండా పోకిరి సినిమా 175 రోజుల పాటు థియేటర్లలో ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ దెబ్బతో అప్పటివరకూ ప్రిన్స్ గా ఉన్న మహేష్, సూపర్ స్టార్ మహేశ్ గా మారిపోయాడు. పోకిరితో మంచి ఊపు మీదున్న పూరికి, ఈసారి అల్లువారి అబ్బాయి అల్లు అర్జున్ తోడయ్యాడు. మెగా అల్లుడిని దేశముదురుగా చూపించిన పూరి, తన హీరోని మొదటిసారి సిక్స్ ప్యాక్ లో చూపించాడు. దేశముదురు సినిమా చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్ బన్నీకి స్టైలిష్ స్టార్ అనే బిరుదు ఇచ్చేశారంటే, ఈ మూవీలో అల్లు అర్జున్ మేకోవర్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. బన్నీకి హిట్ ఇవ్వడంతో, మెగాస్టార్ తన వారసుడిని పరిచయం చేసే బాధ్యత పూరి చేతిలో పెట్టాడు. రామ్ చరణ్ ని హీరోగా పరిచయం చేస్తూ పూరి చిరుతతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

రెండేళ్లలో మూడు సినిమాలు చేసి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన పూరి… ఇదే స్ట్రీమ్ కంటిన్యూ చేస్తాడు అనుకుంటే… ఊహించని మార్పులు, దెబ్బలు పూరికి గట్టిగా తగిలాయి. వరుస హిట్లకు అలవాటు పడ్డ పూరి రెబెల్ స్టార్ ప్రభాస్ తో మూవీ చెయ్యడానికి సిద్ధం అయ్యాడు. రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి తర్వాత హిట్ లేకపోవడంతో ప్రభాస్, పూరిని కలిశాడు. ఈ కలయికలో బుజ్జిగాడు బయటకి వచ్చింది. హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ ని సరికొత్తగా చూపించాలి అనుకున్న పూరి ప్రయత్నం హిట్ అయింది కానీ సినిమా ఫ్లాప్ అయింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా ఫ్లాప్ అవడంతో, తనకు బాగా కలిసొచ్చిన హీరో రవితేజతో నేనింతే మూవీ చేశాడు. సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకి పరిచయం చేస్తూ వచ్చిన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. రెండు ఫ్లాప్స్ తర్వాత, హిట్ కొట్టడానికి పూరి చేయని ప్రయత్నమంటూ ఏది లేదు కానీ వరుసగా ఆరు ఫ్లాపులు వచ్చాయి. పూరి అభిమానులు కూడా ఏమయ్యింది మా డైరెక్టర్ కి, ఎందుకు ముందులా సినిమా చేయలేకపోతున్నాడు అంటూ చాలా బాధ పడ్డారు. ఇండస్ట్రీ వర్గాలు… మళ్లీ పూరి పని అయిపోయింది అంటూ విమర్శలు చేశారు.

ఎంతో మందికి హీరోలకి బ్లాక్ బస్టర్ హిట్లని అందించిన డైరెక్టర్ కి, కష్టకాలంలో ఏ ఒక్క హీరో కూడా అవకాశం ఇవ్వలేదు. 3 ఇయర్స్ లో అయిదు సినిమాలు చేసిన పూరి ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయాడు. ఇలాంటి సమయంలో పూరికి ఛాన్స్ ఇచ్చే హీరో తెలుగులో కనిపించలేదు కానీ వర్మ పుణ్యమాని ఒక బాలీవుడ్ స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చాడు.

హైదరాబాద్ నుంచి బాలీవుడ్ బయల్దేరిన పూరి, ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ తో కలిసి బుడ్డా హోగా తేరా బాప్ సినిమా చేశాడు. లెజెండ్ గా ఎదిగిన అమితాబ్ మార్క్ డైలాగ్స్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మోవీతో అమితాబ్, చాలా రోజుల తర్వాత సోలో హిట్ అందుకున్నాడు. ఈ హిట్ తో పూరి పేరు బాలీవుడ్ లో మారుమోగింది. ఇక గురువు వర్మ లాగానే పూరి కూడా బాలీవుడ్ లోనే సెటిల్ అవుతాడని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే తెలుగులో ఫ్లాప్స్ ఇచ్చి పక్కకి పోవడం ఇష్టం లేదో లేక హిందీలో చేస్తే మరో వర్మ అవుతాని కానీ నా మార్క్ ఉండదేమో అనుకున్నాడో కానీ పూరి మళ్లీ తెలుగు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ సమయంలో అతిధి, ఖలేజా లాంటి ఫ్లాప్స్ లో మహేశ్ బాబు కనిపించాడు. పోకిరి లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో మూవీ చేస్తే హిట్ కొట్టొచ్చు లేదా కొత్తగా కనిపించొచ్చు అనే అలోచనతో మహేశ్, పూరితో మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా బిజినెస్ మాన్… పోకిరి పోలీస్ కథ అయితే, ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. మహేశ్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి ఘట్టమనేని అభిమానులు ఫిదా అయ్యారు. మహేశ్ పెట్టుకున్న నమ్మకాన్ని పూరి పూర్తిగా నిలబెట్టుకున్నాడు. అయితే బిజినెస్ మాన్ కన్నా ముందే దూకుడు రిలీజ్ కావడంతో, మహేశ్ కి అది కంబ్యాక్ మూవీ అయ్యింది.

దాదాపు ఆరు ఫ్లాపులు ఇచ్చిన తర్వాత, బిజినెస్ మాన్ తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు.. ఇక ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తాడు అనుకున్నారు కానీ పూరికి రాబోయేది మరింత కష్టకాలం అనేది తెలియదు. దేవుడిని నమ్మే అలవాటు లేదు, ఏది జరగాలని కోరుకోని ఉండడు… కష్టాన్ని నమ్ముకున్న వాడు కదా… సినిమానే కాపాడుతుందని భావించాడు. అందుకే ఎన్ని ఫ్లాపులు వచ్చినా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

నమ్మిన వాళ్లు మోసం చేశారు, వంద కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నాడు, పెంచుకున్న కుక్కలని కూడా అమ్మేశాడు. జీవితంలో ఏ రోజు కంటతడి పెట్టని పూరి, తన పెంపుడు కుక్కలని అమ్మేసిన రోజు జీవితంలో మర్చిపోలేనని చాలా సార్లు చెప్పాడు. ఇలాంటి సమయంలో పూరికి, ఛార్మి అండగా నిలిచింది. ఈ సమయంలో వీళ్ళ రిలేషన్షిప్ గురించి చాలా రూమర్లు బయటకి వచ్చాయి. వాటిలో నిజం ఏంత వరకూ ఉందో తెలీదు కానీ తన కష్టకాలంలో తోడుగా ఉన్న ఛార్మిని మాత్రం పూరి ఎప్పుడూ వదిలి పెట్టలేదు. పర్సనల్ లైఫ్ లో ప్రొబ్లెమ్స్ ఫేస్ చేసిన పూరి… 2011 నుంచి నాలుగేళ్ల పాటు 2014 వరకూ నాలుగు సినిమాలు చేసినా ఒక్క హిట్ కూడా ఇవ్వలేదు. ఏడాదికి రెండు సినిమాలు గ్యారెంటీగా చేసే పూరికి ఈసారి ఏకంగా ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్నాడు. ఇక పూరి సినిమా చేయడు, ఏ హీరో అవకాశం ఇవ్వడు అనుకున్నారు కానీ పూరి పడి లేచిన కెరటం, పడినా లేస్తున్న కెరటం అని వారు గుర్తించలేకపోయారు.

పడిన ప్రతిసారి లేవడం అలవాటు అయిన పూరి, పడిపోతున్న హీరోలని నిలబెట్టడానికే సినిమాలు చేస్తాడు అన్నట్లు. అయిదేళ్ల పాటు హిట్ అనే పదానికే దూరంగా ఉన్న ఎన్టీఆర్ కలిశాడు. ఫ్లాపుల్లో ఉన్న ఇద్దరు కలిసి మరో ఫ్లాప్ ఇస్తాడన్మి ఇండస్ట్రీ వర్గాలు కూడా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కెరీర్ మొత్తంలోనే టెంపర్, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. నెగటివ్ టచ్ ఉన్న రోల్ లో ఎన్టీఆర్ ని చూపిస్తూ, వక్కంతం వంశీ కథకి… తన మార్క్ మేకింగ్ అండ్ టేకింగ్ కలవడంతో టెంపర్… పూరి అండ్ ఎన్టీఆర్ కి కంబ్యాక్ ఫిల్మ్ గా నిలిచింది. పూరి పని అయిపొయిందన్న ప్రతి ఒక్కరితో, పూరి సినిమా చేస్తే ఇలా ఉంటుందిరా అనే డైలాగ్ కొట్టించాడు.

2015కే బెస్ట్ మూవీ ఇచ్చిన పూరి, ఆ తర్వాత మళ్లీ ఫ్లాపుల బాట పట్టాడు. హిట్ ఇచ్చిన ఇయర్ లోనే ఫ్లాప్ కూడా ఇచ్చి బాలన్స్ చేశాడు. అయితే టెంపర్ ఇంపాక్ట్ ఉండడంతో పూరిపై ముందులా విమర్శలు వినిపించలేదు. పూరి రేంజ్ సినిమాలు కాకపోయినా ఆ తర్వాత చేసిన మూవీస్ పర్వాలేదని పించుకున్నాయి. కానీ పూరి పర్సనల్ లైఫ్ పై మచ్చ పడింది. జ్యోతి లక్ష్మి, ఇజం యావరేజ్ సినిమాలుగా నిలువగా… లోఫర్, రోగ్ సినిమాలు భారీ డిసాస్టర్స్ గా నిలిచాయి. మళ్లీ మొదటికి వచ్చింది, పూరి పని అయిపొయింది అనే మాట మళ్లీ వినిపించింది… ఈ సమయంలో హిట్ ఫ్లాప్ అనే విషయాలని పట్టించుకోని బాలకృష్ణ కలిశాడు. ఇద్దరు మెంటల్లోళ్లు కలిసి సినిమా చేస్తున్నారు, బయటకి వస్తది రాదో అన్న అనుమానం అందరిలో ఉండేది కానీ పైసా వసూల్ సినిమా నందమూరి అభిమానులకి కొత్త బాలకృష్ణని పరిచయం చేసింది. 100 సినిమాలు చేసిన బాలకృష్ణ, పైసా వసూల్ లో చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. రిజల్ట్ ని పక్కన పెడితే పైసా వసూల్ మూవీ, బాలయ్య కెరీర్ లో తప్పకుండా ఒక మెమొరబుల్ మూవీ. బాలయ్యని కొత్తగా చూపించిన పూరి, కొడుకు ఆకాష్ ని హీరోగా నిలబెట్టడానికి రంగంలోకి దిగాడు. మెహబూబా పేరుతో పూరి చేసిన ఈ ప్రయోగం బెడిసి కొట్టింది.

కొడుకుని హీరోగా నిలబెట్టుకోలేక పోయాడు… నమ్మిన బాలకృష్ణకి న్యాయం చేయలేకపోయాడు, హీరోగా నిలబెట్టిన తానే రవితేజకి ఫ్లాప్ ఇచ్చాడు.. చిరు రీఎంట్రీకి సరిపోయే కథ సిద్ధం చేయలేకపోయాడు… ఒక మనిషి టైం అయిపొయింది అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణలు కావాలా… పూరి కేవ్స్ త్వరలో క్లోజ్ చేసేయాల్సిందేనని ఇండస్ట్రీ అంతా భావించింది.

ఒక్క సినిమానే చేసి, అప్పుతో ఆఫీస్ కట్టుకున్న పూరి… మూసేయాల్సి వస్తుంది అన్న అదే కేవ్స్ లో కూర్చొని, కథని రాయడం మొదలుపెట్టాడు. ఏడు రోజుల్లో కథ రాసే పూరి, ఆరు నెలలు కనిపించకుండా పోయాడు… పూరి మిస్సింగ్, ఎం అయ్యింది? ఎవరితో సినిమా చేయబోతున్నాడు? ఎలాంటి సినిమా చేయబోతున్నాడు? అసలు సినిమా చేస్తాడా లేదా అంటూ ఎవరి పాటికి వారు తోచింది మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో పూరి, ఇస్మార్ట్ శంకర్ అంటూ బయటకి వచ్చాడు. స్టార్ హీరోల వెనక పడడం మానేసి, హిట్ కథని సిద్ధం చేశాడు. ఏ స్టార్ హీరో అవసరం లేదని రామ్ పోతినేనితో జతకట్టి, ప్రతిఒక్కరిని ఆశ్చర్యపరిచే రేంజ్ హిట్ ఇచ్చాడు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రామ్ ని పూర్తిగా చేంజ్ చేసి… పూరి కంప్లీట్ మాస్ లుక్ లో చూపించాడు.

తెలంగాణ యాసలో తెరపై రామ్ డైలాగులు చెప్తుంటే, బీసీ సెంటర్స్ విజిల్స్ తో మోతమోగాయి. సాంగ్స్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ… ఇలా ప్రతి విషయంలో ఇస్మార్ట్ శంకర్ సక్సస్ అయ్యింది. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ… పూరి ఈజ్ బ్యాక్ అన్నారు కానీ నిజానికి పూరి ఎప్పుడూ బ్యాక్ అవ్వలేదు. తన పని తాను చేసుకుంటూ పోయాడు, ఆ ప్రయత్నంలోనే హిట్స్ అండ్ ఫ్లాప్స్ వచ్చాయి అంతేకాని హిట్ కంటూ పూరి దగ్గర స్పెషల్ ఫార్ములా ఏమీ లేదు. సినిమానే జీవితం… ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ని కొనసాగిస్తూ …. పూరి, రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీతో అయినా పూరి హిట్ స్ట్రీక్ కంటిన్యూ చేయాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పూరి సినిమాలు చేయడం ఆపడు, ఎందుకంటే పూరికి అది తప్ప ఇంకో పని తెలియదు. పూరి సినిమాని ప్రేమిస్తాడు, సినిమా మనిషిగా బ్రతుకుతాడు.. బ్రతికున్నంత కాలం సినిమాని చేస్తూనే ఉంటాడు. ఇది కూడా చేతకాకపోతే, సినిమాలు చూస్తూ ఉండిపోతాడు. సినిమాని ఇంతగా ప్రేమించే వ్యక్తి, అది తప్ప ఇంకేమి చేయగలడు చెప్పండి. పడినా లేచాడు, పడుతానని తెలిసినా చేశాడు. అందుకే ఎన్ని ఫ్లాపులు వచ్చినా పూరి నుంచి సినిమా వస్తుంది అంటే సినిమా అభిమానులందరూ థియేటర్స్ లో కనిపిస్తారు. అది ఆయనకి మాత్రమే దక్కిన గౌరవం, ఈ రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన సంపాదించుకున్న గౌరవం. 2009 నుంచి 2019 వరకూ కేవలం రెండే హిట్స్ ఇచ్చినా ఇప్పటికీ పూరి దర్శకుడిగా నిలబడుతున్నాడు అందుకే పూరి జగన్నాధ్ స్టార్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ది డికేడ్ అయ్యాడు.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.