Thu. Oct 24th, 2019

Sambashana

Online News Portal

రివ్యూ: సైరా కథలో లోపం అదే

1 min read

ముఖ్య గమనిక: మేము మా రివ్యూని సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల తర్వాతే ఇస్తాము.

టైటిల్: సైరా
జానర్: పీరియాడిక్ వార్ డ్రామా/ బయోపిక్
నటీనటులు: చిరంజీవి, అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా తదితరులు
సంగీతం : అమిత్ త్రివేది
నిర్మాత: రామ్ చరణ్
దర్శకత్వం: సురేందర్ రెడ్డి

రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమా సైరా. భారీ బడ్జట్ తో అంతకన్నా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఎంత వరకూ మెప్పించిందో చూద్దాం.

కథ
1857లో తెల్లదొరలపై పోరాటం చేసిన ఝాన్సీ రాణి లక్ష్మీ భాయి, తన సైనికుల్లో ధైర్యం నింపడానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ చెప్పడం మొదలు పెడుతుంది. రేనాటి సూర్యుడిగా రాయలసీమ వాసులకి బాగా తెలిసిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846లోనే 61 మంది పాలేగాళ్ల ను ఏకం చేసి బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురెళ్లి పోరాటం చేసిన మజ్జారి నరసింహారెడ్డి, అసలు తిరుగుబాటు ఎందుకు చేయాలి అనుకున్నాడు? అతని పోరాటం ఎక్కడ మొదలయ్యింది? ఆ పోరాటంలో అతనికి అండగా నిలిచింది ఎవరు? ఉయ్యాలవాడ కథ విన్న తర్వాత ఝాన్సీ రాణి సైన్యం ఏం చేశారు? అన్నదే సైరా కథ కథనం. 

నటీనటులు
సైరా సినిమా గురించి చెప్పాల్సి వస్తే చిరు తర్వాతే ఎవరి గురించైనా మాట్లాడాలి. 64 ఏళ్ల వయసులో కూడా వీరుడి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించడం మెగాస్టార్ కి మాత్రమే సాధ్యం. ముఖ్యంగా క్లైమాక్స్ లో చిరు నటనకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకి చిరు ప్రాణం పోశాడు. చిరంజీవి తర్వాత అంత గొప్ప పాత్రలో నటించింది ఎవరూ అంటే అందరి నుంచి వినిపించే ఏకైక పేరు తమన్నా. నరసింహారెడ్డి ప్రేయసి లక్ష్మిగా కనిపించిన తమన్నా, ఉద్యమానికి ఊపిరిని అద్దే బాధ్యతను తీసుకోని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తమన్నా చనిపోయే సీన్, ఆమె కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇక అవుకు రాజు పాత్రలో కనిపించిన సుదీప్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. అవుకు రాజు పాత్రని డిజైన్ చేసిన విధానమే బాగుంది, అంత మంచి పాత్ర సుదీప్ లాంటి నటుడి చేతిలో పడడంతో సైరాకి బాగా హెల్ప్ అయ్యింది. గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్‌ గౌరవ పాత్రలో నటించారు. కనిపించింది కొన్ని సీన్స్‌లోనైనా.. తెరపై ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా హుందాగా ఉంది. వీరా రెడ్డిగా జగపతి బాబు క్లైమాక్స్‌లో కంటతడి పెట్టిస్తాడు.

మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతి పాత్ర నిడివి తక్కువే అయినా రాజా పాండిగా నమ్మిన బంటు పాత్రలో ఒదిగిపోయాడు. అతని సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకోవడంతో డైలాగ్స్ చాలా నాచురల్ గా వచ్చాయి. సిద్దమ్మ పాత్రలో కనిపించిన లేడీ సూపర్ స్టార్ నయనతార, ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించింది. క్యారెక్టర్ నచ్చితే సినిమా చేయడానికి తనకి నిడివితో సంబంధం లేదని నయన్ ప్రూవ్ చేసింది. పైన చెప్పిన వారంతా వారి వారి ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లే. అయితే సైరా సినిమాలో వీరి స్థాయిలనేో మెప్పించిన మరో నటుడు సాయి చంద్, ఫిదా సినిమాలో సాయి పల్లవి తండ్రిగా కనిపించిన సాయి చంద్ సైరలో సిద్దయ్య పాత్రలు జీవించాడు. రెండు సీన్స్ లో గూస్ బంప్స్ తెప్పించిన సాయి చంద్ థియేటర్స్ లో విజిల్స్ వేయించాడు. ఇక రవికిషన్‌, బ్రహ్మాజి, అనుష్క, నరసింహారెడ్డి అమ్మ పాత్రలో కనిపించిన లేడీ ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ
ఇప్పటి వరకూ కమర్షియల్ దర్శకుడిగా మాత్రమే పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఇంత భారీ బడ్జట్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనే అనుమానం అందరిలోనూ ఉండేది. సైరా చూసిన తర్వాత అవన్నీ పటాపంచలు అయిపోయాయి. చరిత్ర పుటల్లో అంతగా లేని నరసింహా రెడ్డి కథను, నేటి తరానికి దగ్గరయ్యేలా చెప్పిన సురేందర్ రెడ్డి, నరసింహారెడ్డి పోరాటాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినంత టైం తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో హీరో ఎలివేషన్ కి, బ్రిటిష్ ఆగడాలు చూపించడానికే కేటాయించిన సురేందర్ రెడ్డి, సెకండ్ హాఫ్ మొత్తాన్ని పోరాటానికి వాడుకున్నాడు. 14 ఏళ్ల పాటు ఈ కథతోనే ట్రావెల్ అయిన పరుచూరి బ్రదర్స్ తెలుగు వీరుడి కథని ప్రపంచానికి తెలిసేలా చేశారు.

సైరా సినిమాకి ఉన్న మరో ప్రధాన బలం సినిమాటోగ్రఫీ, రత్నవేలు కెమెరా వర్క్ సైరా స్థాయిని పెంచింది. సీన్ మూడ్ ని ఎలివేట్ చేసేలా ఉన్న రత్నవేలు పనితనం అద్భుతంగా ఉంది. ఇక సైరాకి బాగా కలిసొచ్చిన మరో రెండు విషయాలు మాటలు, సంగీతం. సాయి మాధవ్ బుర్రా రాసిన వీరుడిని కాదు నాయకుడినే పంపించా, ద్వేషం కోసం కాదు దేశం కోసం నిలబడు లాంటి డైలాగులు థియేటర్స్ లో విజిల్స్ వేయిస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్స్ అమిత్ త్రివేది, జూలియస్‌ ప్యాకియమ్‌ అందించిన మ్యూజిక్ సైరా సినిమాని ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా చేసింది. విజువల్, డైలాగ్, మ్యూజిక్ ఈ మూడు కరెక్ట్ గా పడితే ఏ సీన్ అయినా ఎలివేట్ అవుతుంది. సైరా విషయంలో జరిగింది ఇదే. ఈ సినిమాని రాజీ పడకుండా నిర్మించడంలో రామ్ చరణ్ తేజ్ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్‌, క్యాస్టూమ్‌, ఆర్ట్‌ ఇలా అన్ని విభాగాలు సినిమాను విజయవంతం చేయడంలో సహాయపడ్డాయి.

విమర్శ: సైరా సినిమా గురించి అన్ని పాజిటివ్స్ మాత్రమే చెప్తున్నారు నెగేటివ్స్ లేవా అంటే కావాల్సినన్ని ఉన్నాయి. మెయిన్ నెగటివ్ సైరా కథనే, తనకి రావాల్సిన భరణం కోసం ఒక పాలెగాడు, తన లాంటి 60 మంది పాలెగాళ్లతో కలిసి చేసిన పోరాటాన్ని స్వాతంత్ర పోరాటంగా చెప్పడం, అదో పెద్ద యుద్ధంగా చూపించడం ఈ కథకి అతిపెద్ద లోపం. సినిమా చూసే వాళ్లకి అది తెలియక పోవచ్చు కానీ చరిత్ర విన్న వాళ్లకి అది తెలుస్తుంది. నరసింహారెడ్డి పాలెగాడు కాబట్టే ఎన్నో పౌరాణిక, చరిత్రక, సామజిక సినిమాలు చేసిన ఒకప్పటి మన స్టార్ హీరోలు ఉయ్యాలవాడ కథతో సినిమా చేయలేదు. ఇక చిరు ఏజ్ ని దృష్టిలో పెట్టుకోని డూప్ తో కొన్ని ఫైట్ సీన్స్ తీశారు అనే విషయాన్ని కవర్ చేయడానికి ఫాస్ట్ ఫేజ్ లో యాక్షన్ సీన్స్ తెరకెక్కించి, చిరు మొహం కనిపించే సమయంలోనే స్లో మోషన్ చేయడం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అయితే చిరు ఏజ్ ని దృష్టిలో పెట్టుకోని ఆ విషయాన్ని మర్చిపోవచ్చు. చిరు తమన్నా మధ్య వచ్చే సీన్స్ కూడా కాస్త ఎబ్బుట్టుగా ఉంటాయి. ఇవి చిన్న చిన్న లోపాలే కాబట్టి సైరా సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుంది.

చివరి మాట: సినిమా పేరుతో పాలెగాడి కథని స్వాతంత్ర సమరయోధుడి కథగా, ముగ్గరు భార్యలు ఉన్న వ్యక్తిని ఒకే భార్య ఒకే ప్రేయసి అన్నట్లుగా, గెరిల్లా పోరాటాన్ని యుద్ధంగా చిత్రీకరించడం ప్రేక్షకులని మోసం చేయడమే. ఇది చరిత్ర అనే విషయం పూర్తిగా పక్కన పెట్టి ఒక మెగాస్టార్ చిరంజీవి సినిమాగా మాత్రమే చూస్తున్న ప్రేక్షకులు సైరాకి బ్రహ్మరథం పడుతున్నారు.

1 thought on “రివ్యూ: సైరా కథలో లోపం అదే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.