Thu. Oct 24th, 2019

Sambashana

Online News Portal

ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణలకి సైరా కనిపించలేదా?

1 min read

సైరా సినిమా మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన సినిమా అని చిత్ర యూనిట్ బాగా ప్రచారం చేసింది. గాంధీ జయంతి నాడు ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో సూపర్ హిట్ టాక్ రాబట్టింది. అయితే తెల్లదొరలపై ఇంతటి పోరాటం చేసిన వీరుడి కథ ఎన్నో పౌరాణిక చారిత్రక సాంఘిక చిత్రాలు తీసిన ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణలకి కనపడలేదా? అంటే ఖచ్చితంగా కనపడే ఉంటుంది కానీ వాళ్లు ఉయ్యాలవాడ కథతో సినిమా చేయడానికి సుముఖం చూపలేదు. అందుకు కారణం నరసింహారెడ్డి పాలెగాడు కావడమే. బ్రిటిష్ వాళ్లతో కలిసి మన ప్రజలని పన్నులతో ఇబ్బంది పెట్టిన ఈ పాలెగాడు వ్యవస్థలోనే నరసింహారెడ్డి పెరిగాడు, తిరిగాడు… ప్రజల నుంచి పన్ను వసూళ్లు కూడా చేశాడు. తనకి బ్రిటిష్ నుంచి రావాల్సిన భరణం రాకపోతే నొస్సామ్ కోటాపై తిరుగుబాటు చేసిన వ్యక్తి మజ్జారి నరసింహారెడ్డి. భరణం కోసం చేసిన తిరుగుబాటులో పోరాటం ఉంది కానీ తిరుగుబాటు లేదు స్వాతంత్రం అంతకన్నా లేదు. పైగా సైరా సినిమాలో నరసింహారెడ్డికి ఒకరే భార్య, ఇంకొకరు ప్రేమికురాలు అని చూపించారు. నిజానికి నరసింహారెడ్డికి ముగ్గురు భార్యలు. త్యాగం, భావావేశం సరైన దిశలో లేని వ్యక్తి కథ ఎప్పటికీ సెల్లింగ్ ప్రోడక్ట్ అవ్వదు. అందుకే మన సీనియర్ స్టార్ హీరోలెవ్వరూ నరసింహారెడ్డి కథతో సినిమా చేయడానికి ముందుకి రాలేదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని చేశాడు. చేయడమే కాదు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఏకంగా మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడిని చేశాడు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డిడి మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం అయితే మరి 16వ శతాబ్దములోనే పోర్చుగీసు ఆక్రమణలకు వ్యతిరేకంగా నాలుగు దశాబ్ధాలు పోరాడి వారిని నిలువరించిన ‘రాణి అబ్బక్క’ (1525-1570) పోరాటాన్ని ఏం అనాలి? ఏ పేరుతో పిలవాలి? మన దేశం ఆక్రమణకు గురి అయిన తర్వాత అతి తక్కువ కాలంలోనే అన్ని ప్రాంతాల్లో తిరుగుబాటు మొదలయ్యింది. మొదట్లో ఈ తిరుగుబాటు తమ రాజ్యాలని కాపాడుకోవడానికి జరిగితే, ఆ తర్వాత పోరాటం దేశం కోసం జరిగింది. తమ చిన్న రాజ్యం కోసం చేసినా, దేశం కోసం చేసినా ప్రతి తిరుగుబాటు ప్రజల్లో చైతన్యం తెచ్చిందే. అయితే నరసింహారెడ్డి పోరాటంలో ఈ రెండూ లేవు, అతనిది వ్యక్తిగత పోరాటం. ఇది తెలుసు కాబట్టే దర్శకుడు సురేందర్ రెడ్డి, ఇది చరిత్ర కాదు కల్పిత కథ మాత్రమే అని ఏకంగా కోర్ట్ ముందే చెప్పాడు. అది సెన్సార్ కోసం చెప్పాడా లేక మరేదైనా కారణమా అనే విషయం పక్కన పెడితే… సురేందర్ రెడ్డి చెప్పిన మాట మాత్రం అక్షర సత్యం. సైరా సినిమా ఒట్టి కట్టు కథ మాత్రమే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథలో చిరంజీవి నటించడమే సైరా సినిమాకి సెల్లింగ్ పాయింట్. ఒక పాలెగాడు తనకు రావలసిన భరణం కోసం మాత్రమే పోరాడిన కథలో మెగాస్టార్ నటించడమే సైరా బలం, చిరంజీవినే సైరా స్థాయిని ఆకాశానికి పెంచాడు.

సరిగ్గా అప్పట్లో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కాబట్టి ఉయ్యాలవాడ నరసింహారెడీ మొదట్లో తన భరణం కోసం పోరాడి, నెమ్మదిగా ఆ పోరాటాన్ని దేశం కోసం చేశాడని అనుకుందాం. అలా చూసినా నరసింహారెడ్డిది సంగ్రామమే కాని మొట్టమొదటిది కాదు. ఈ పాలెగాడి కథను మొదటి స్వాతంత్ర సంగ్రామం అని ప్రచారం చేసిన తీరు చాలా దారుణం. ఎందుకంటే సినిమా ఎప్పటికీ మిగిలిపోతుంది, ఈ కథనే నిజం అని ప్రజలు నమ్మి నరసింహారెడ్డి మొట్టమొదటి స్వాతంత్రసమరయోధుడు అని గుర్తు పెట్టుకుంటే మాత్రం ఆయన కన్నా ముందే పోరాటం చేసి ప్రాణాలు వదిలిన ప్రతి ఒక్కరికి మనమే అన్యాయం చేసినట్లు అవుతుంది. అప్పుడు బ్రిటిష్ వాళ్లు కాదు ఇప్పుడు మనం దారుణంగా హత్య చేసినట్లే అవుతుంది. దేశ ద్రోహం పాపం అయితే, దేశం కోసం ప్రాణాలు వదిలిన వాళ్లని మర్చిపోవడం అంతకన్నా పెద్ద పాపం. రేపు ఏ రాణి వేలు నచియర్ (1730– 1796) పైనో, వీర పాండ్య కట్టబొమ్మన్(1760-1799) పైనో, టిరోట్ సింగ్ (1802 – 1835), పులి తేవార్ (1715-1767) పైనో సినిమా చేయాలి అనుకుంటే ఎన్నో స్వాతంత్ర వీరుడి కథ అని చెప్పాలో మీరే చెప్పండి.

ముఖ్య గమనిక: పైన చెప్పిన రాణి వేలు నచియర్, వీరపాండ్య కట్టబొమ్మన్, టిరోట్ సింగ్, పులి తేవార్ లాంటి వీరులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కన్నా దశాబ్దాల ముందే తిరుగుబాటు జండా ఎగరేసిన వారు. ముఖ్యంగా 1767లో మరణించిన తమిళనాడుకి చెందిన పులి తేవార్ బ్రిటీషర్లపై మొదటిసారి తిరుగుబాటు చేసిన రాజుగా తమిళనాట కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇలాంటి UNSUNG HEROES గురించి చెప్పాలి అంటే ఈ ఆర్టికల్ సరిపోదు. చరిత్ర పుస్తకాలు తిరగేయండి ప్రాంతానికో వీరుడు/వీర వనిత మీకే కనిపిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.